Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Kanagal : శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వేళాయె

Kanagal : శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వేళాయె

కనగల్, మనసాక్షి :

భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి) శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జూన్ 1వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అమ్మవారి కల్యాణోత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు.

 

భక్తుల సౌకర్యార్థం ఆలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం చుట్టూ చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు – జమదగ్ని మహామునిల 21వ వార్షికోత్సవ తిరుకళ్యాణ మహోత్సవము వేద పండితుల మంత్రోచ్ఛారణలతో మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా నిర్వహించనున్నారు.

 

ఉత్సవాల మొదటి రోజు 28న విగ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, సహస్రనామార్చన, నీరాజన, మంత్ర పుష్పములు, అంకురార్పణ, పుట్ట బంగారం, హోమం, బలిహరణ పూజలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రెండో రోజు 29న మంగళ వాయిద్యాలతో ధ్వజారోహణ, నిత్య హోమములు, నవగ్రహ హోమము, చండీ హోమం, సాయంత్రం ఎదురుకోళ్ళు మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించనున్నట్టు ఎండోమెంట్ అధికారులు పేర్కొన్నారు.

 

బ్రహ్మోత్సవాల మూడో రోజు 30వ తేదీ మంగళవారం స్వయంభూ వెలసిన శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు – జమదగ్ని మహామునిల లోక కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. కళ్యాణమూర్తుల ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాకార మండపం నుంచి పల్లకిలో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చి వేద పండితుల మంత్రోచ్ఛారణతో మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ ఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నారు.

 

అమ్మవారి కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. అమ్మవారి కళ్యాణానికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఆయురారోగ్యాలతో పిల్లాపాపలను చల్లగా చూడాలని అమ్మవారికి భక్తులు వడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.

 

నాలుగో రోజు గురువారం అమ్మవారికి ధర్వేశిపురం, పర్వతగిరి గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించనున్నారు. జూన్ 1న ఉత్సవాల చివరి రోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన, తీర్థ ప్రసాద గోష్టి తదితర పూజా కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు రాత్రి వేళల్లో ఆలయం వద్ద కళా బృందాలచే ప్రదర్శనలు, కథలు, కోలాట ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు