28 నుంచి ఇంటింటి సర్వే.. వారంతా సిద్దంగా ఉండాలి..!
28 నుంచి ఇంటింటి సర్వే.. వారంతా సిద్దంగా ఉండాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
స్పెషల్ సమ్మరీ రివిజన్, ఆదాయ, కుల ధ్రువపత్రాల జారీ, ధరణి పెండింగ్ దరఖాస్తులు, సీఎం ప్రజావాణి, లోకల్ ప్రజావాణి అంశాలపై శనివారం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అదనపు కలెక్టర్లు మయాంక్ మిత్తల్, అశోక్ కుమార్ లతో కలిసి సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల వారీగా బి ఎల్ వో లు ఇంటింటి సర్వే నిర్వహించి, ఏ ఇంట్లోనైనా ఎక్కువ ఓటర్లు ఉండి, పోలింగ్ కేంద్రాలు వేరువేరుగా ఉంటే సరి చేసి అందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎక్కడైనా ఒక్కరికే రెండు ఓట్లు ఉంటే, ఒక ఓటును తొలగించి మరో ఓటును సదరు ఓటరు ఏ పోలింగ్ కేంద్రంలో ఉండాలని కోరుకుంటే అదే పోలింగ్ కేంద్రంలో అతని ఓటును ఉంచాలన్నారు. ఈనెల 28 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందని, అంతలోపు సర్వేకు బిఎల్ఓ లను సంసిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పదవ తరగతి విద్యార్థులకు ఇచ్చే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ చేసే విషయంలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని ఆమె సూచించారు. పెండింగ్ ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. వీటితో పాటు లోకల్ ప్రజావాణి, సీఎం రేవంత్ రెడ్డి ( హైదరాబాద్) ప్రజావాణి ద్వారా దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు.
లోకల్ ప్రజావాణి ద్వారా వచ్చిన 174 దరఖాస్తుల లో 84 పెండింగ్ లో ఉన్నాయని, అలాగే సీఎం ప్రజావాణి నుంచి 170 దరఖాస్తులు రాగా 80 ప్రాసెస్ లో ఉన్నాయని, మిగతా 90 పెండింగ్ లో ఉన్నాయని, ఈ రెండు మూడు రోజులలో పెండింగ్ దరఖాస్తులన్నీ క్లియర్ చేయాలని ఆమె ఆదేశించారు.
అంతకుముందు సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ మాట్లాడుతూ బిఎల్ఓ లు ఇంటింటి సర్వేలో ఇంటి నెంబర్లు, పేర్లను సరి చూసుకోవాలన్నారు. ఇంకా ఎవరైనా ఓటు నమోదు చేసుకోకపోతే అక్టోబర్ వరకు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ సమీక్షలో జిల్లాలోని అన్ని మండలాల తహసిల్దారులు, ఆర్డీవో కార్యాలయ ఏ ఓ పాల్గొన్నారు.
ALSO READ :
Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
Job Mela : రేపు మెగా జాబ్ మేళా, సద్వినియోగం చేసుకోండి.. జిల్లా ఎస్పీ..!









