Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : ఐటీ పరిశ్రమలకు వేదిక.. అభివృద్ధి పనులు మరింత వేగవంతం..!

Hyderabad : ఐటీ పరిశ్రమలకు వేదిక.. అభివృద్ధి పనులు మరింత వేగవంతం..!

శేరిలింగంపల్లి , మన సాక్షి:

ప్రజా సమస్యల పరిష్కారానికి పలు విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని పీఏసీ ఛైర్మన్‌ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు.  శేరిలింగంపల్లి జోనల్‌ స్థాయిలో ఆయా శాఖలతో సమన్వయ సమావేశం జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన  జోనల్‌ కార్యాలయంలో జరిగింది. సమన్వయ సమావేశానికి  పోలీసు, ట్రాఫిక్‌, ఇంజినీరింగ్‌ ,ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, రెవిన్యూ,  విద్యుత్‌, బయోడైవర్సిటీ, పట్టణ ప్రణాళిక, ఎస్ఆర్‌డీపీ,జలమండలి, హెచ్‌ఆర్‌డీసీఎల్‌,హెల్త్‍, పారిశుద్ధ్యం సహా  పలు  విభాగాధిపతులు పాల్గొన్నారు.

ఈ సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా పీఏసీ ఛైర్మన్‌ ఎమ్మెల్యే అరికపూడి గాంధీహాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   నానాటికీ పెరుగుతున్న జనాభా ట్రాఫిక్‌ వాహనాల వినియోగం ప్రజా సౌకర్యాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా కృషి చేయటం ద్వారా మరిన్ని సత్ఫలితాలు నమోదవుతాయన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివసించే ప్రాంతంగా ఐటీ పరిశ్రమలకు వేదికగా ఉన్నందున  సమస్యలను వేగంగా పరిష్కరించి అభివృద్ధి పనులను మరింతగా వేగవంతం చేయాలన్నారు. రహదారుల విస్తరణ, కూడళ్ల అభివృద్ధి, డైనేజీ సమస్యలు, రహదారులపై గుంతలు, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని , సమన్వయం లోపిస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని పీఏసీ ఛైర్మన్‌ గాంధీ పేర్కొన్నారు.

ప్రధాన రహదారులపై ఉన్న ఫుట్‌ పాత్‌ల ఆక్రమణలను తొలగించాలని,పాదచారుల భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని,చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృదిని చేపట్టాలని  సూచించారు.  గంగారం హనుమాన్‌ దేవాలయం నుంచి అపర్ణ వరకు వంద ఫీట్ల రోడ్డు, శ్రీదేవీ థియేటర్‌ రహదారి విస్తరణ సహా లింక్‌ రహదారుల నిర్మాణానికి  యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల మంజూరు కోసం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళతామని , అభివృద్ధే ప్రధాన అజెండాగా ముందుకు సాగాలని పీఏసీ ఛైర్మన్‌ గాంధీ స్పష్టం చేసారు.

జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ రహదారుల విస్తరణకు ఆటంకంగా ఉన్న విద్యుత్‌ స్తంబాల మార్పును వేగవంతం చేపట్టాలని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి గాను జంక్షన్‌లను మరింతగా విస్తరించాలని, ఉపయోగంలో లేని, ట్రాఫిక్‌కు ఆటంకంగా ఉన్న బస్సు షెల్టర్ల తొలగించనున్నామన్నారు. లింగంపల్లి రస్తాలో ఫ్లె ఓవర్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, లింగంపల్లి చౌరస్తా  నుంచి కూకట్‌పల్లి వరకు సర్వీసు రోడ్డును నిర్మించాలని జోనల్‌ కమీషనర్‌ పేర్కొన్నారు.

పలు చెరువులలో డైనేజీ నీరు కలుస్తున్నందున డైవర్షన్‌ చానళ్ల ద్వారా మురుగు నీటిని డైనేజీలలోకి దారి మళ్లించాలన్నారు. దుర్గం చెరువు వాకింగ్‌ ట్రాక్‌పైకి డైనేజీ నీరు చేరి వాకర్లకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నందున తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డి ఆదేశించారు. జలమండలి అధికారులు ఎప్పటికపుడు క్షేత్రస్థాయిలో తరచూ లీకవుతున్న డైనేజీలకు తక్షణ మరమ్మతులు పూర్తి చేయాలని, సమస్య పునరావృతం కాకుండా చూడాలన్నారు.

పటాన్‌ చెరు, ఆర్‌సీపూర్‌, యూసుఫ్‌గూడ సర్కిళ్ల పరిధిలో చెరువుల సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జడ్‌సీ సూచించారు. పాదచారుల సౌకర్యం కోసం నిర్మించిన ఫుట్‌ పాత్‌లపై నెలకొన్న ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ పోలీసు ట్రాఫిక్‌ విభాగాలు సమన్వయంతో తొలగించాలని, వాటిని పునరుద్ధరించాలన్నారు.

పలు విభాగాల అధికారులు పూర్తిస్థాయి సమన్వయంతో పని చేసి క్షేత్రస్థాయి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రధానంగా ట్రాఫిక్‌ సమస్యల్లేకుండా చూడాలన్నారు. సమన్వయ సమావేశంలోని అంశాలపై తగు పురోగతిని నిర్ణీత గడువులోగా చూపించాలని, తరచూ సమీక్షల ద్వారా మరింత మెరుగైన పరిస్థితుల కల్పనకు కృషి చేయాలని జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డి స్పష్టం చేసారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ జయరాం రెడ్డి, డీసీలు  ముకుంద రెడ్డి,మోహన్ రెడ్డి, సురేష్, సుల్తానా పలు విభాగాల అధికారులు జిహెచ్ఎంసీ  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

(Reporting : Srinivas, ManaSakshi, Sharelingampalli)

LATEST UPDATE :

మరిన్ని వార్తలు