Elephant : గర్భంతో ఉన్న ఏనుగు మృతి.. కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలే కారణం..!
Elephant : గర్భంతో ఉన్న ఏనుగు మృతి.. కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలే కారణం..!
కోయంబత్తూరు, మన సాక్షి:
తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న మరుధమలై కొండలలో 15 నెలల గర్భంతో ఉన్న ఓ ఏనుగు అనారోగ్యంతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఏనుగు మృతికి ప్రధాన కారణం ప్లాస్టిక్ వ్యర్థాలను తినడమేనని తేలడంతో వన్యప్రాణి సంరక్షకులు, పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ భూతం:
మరుధమలై వంటి పర్యాటక, పుణ్యక్షేత్రాలున్న అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఇది ఏనుగులతో పాటు ఇతర వన్యప్రాణులకు ప్రాణసంకటంగా మారుతోంది. ఈ దుర్ఘటన తర్వాత, ఊటీ, కొడైకెనాల్ వంటి పర్వతశ్రేణి పర్యాటక కేంద్రాల్లో మాదిరిగానే అటవీ ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలలోనూ ప్లాస్టిక్, పాలిథిన్ బ్యాగ్‌లపై పూర్తి నిషేధం విధించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
విషాద ఘటన వివరాలు:
పశ్చిమ కనుమలలో భాగమైన కోయంబత్తూరు డివిజన్ పరిధిలోని మరుధమలై అటవీ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతం ఏనుగులు, చిరుతపులులు, అడవి పందుల వంటి అనేక వన్యప్రాణులకు ఆవాసంగా ఉంది. భారతీయార్ విశ్వవిద్యాలయం సమీపంలోని ఈ హిల్ స్టేషన్ వందలాది ఎకరాలలో ఆసియా ఏనుగులకు ఆవాసంగా, కారిడార్‌గా పేరు పొందింది.
మే 17వ తేదీన, ఈ అటవీ ప్రాంతంలో ఓ ఆడ ఏనుగు, దాని పక్కనే ఒక గున్న ఏనుగు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. అటవీ శాఖ అధికారులు క్రేన్ సహాయంతో ఆడ ఏనుగును రక్షించి, ఐదుగురు వెటర్నరీ డాక్టర్లతో శస్త్రచికిత్స చేయించారు. అయితే, ఏనుగు ప్రాణాలు నిలవలేదు. మరణానంతరం నిర్వహించిన పోస్ట్‌మార్టమ్‌లో ఆ ఏనుగు 15 నెలల గర్భంతో ఉందని, కడుపులో ఉన్న పిల్ల కూడా చనిపోయిందని తెలిసింది. అంతేకాకుండా, ఏనుగు కడుపు నిండా భారీ మొత్తంలో ప్లాస్టిక్, పాలిథిన్, పేపర్ వ్యర్థాలు బయటపడ్డాయి.
పశువైద్యులు మాట్లాడుతూ, “ఆ ఏనుగు అప్పటికే శరీరంపై గాయాలు, పలు అవయవాల వైఫల్యంతో బాధపడుతోంది. దాని కడుపులో చాలా ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించాయి. అక్కడ డంప్ చేసిన ఆహార వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్, పాలిథిన్ కూడా తినేసింది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఏనుగు చనిపోవడానికి విషతుల్యమైన ఆహారం, ప్లాస్టిక్ వ్యర్థాలే ప్రధాన కారణం” అని స్పష్టం చేశారు.
ఏనుగు పేడలోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు:
మరణించిన ఏనుగు చిన్న పేగులు, పెద్ద పేగులు ప్లాస్టిక్ వ్యర్థాలు, అల్యూమినియం రేకులతో నిండిపోయాయని డాక్టర్లు ధృవీకరించారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ ప్రాంతంలోని మిగతా ఏనుగుల పేడలోనూ దాదాపు 70 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తున్నాయి. అడవి పందుల వంటి జంతువులకు నాలుగు కడుపు గదులు ఉంటాయని, అవి ప్లాస్టిక్ తింటే కడుపు ఉబ్బి చనిపోతాయని, అయితే ఏనుగుకు ఒకే గది ఉండటం వల్ల ప్లాస్టిక్ తిన్నా పేడతో బయటకు వస్తుందని, కానీ అధికంగా తినడం వల్లనే మరణం సంభవించిందని పశువైద్యులు తెలిపారు.
రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో చనిపోయిన మరో ఏనుగు కడుపులోనూ కిలోల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడటం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. సోమాయంపాళ్యం పంచాయతీలో సేకరించిన చెత్తను అటవీ ప్రాంత సమీపంలోని ఖాళీ స్థలంలో పడేయడమే ఈ పరిస్థితికి కారణమని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ ఆదేశాలతో ఆ చెత్త డంప్‌ను తొలగించారు. అయితే మరుధమలై దేవాలయం, పరిసర అటవీ ప్రాంతాలలో వాడిపడేస్తున్న ప్లాస్టిక్ వస్తువులను మాత్రం పూర్తిగా నియంత్రించలేకపోతున్నారు.
ప్రభుత్వ చర్యలు, పర్యావరణవేత్తల డిమాండ్లు:
జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ, “బయో మైనింగ్ ద్వారా చెత్త తొలగిస్తాం. ఏనుగులు సహా వన్య మృగాలు ఆ ప్రాంతానికి రాకుండా ఆధునిక ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలు వాటికి కనిపించకుండా ఆ ప్రాంతం చుట్టూ చెట్లను పెంచుతాం” అని పేర్కొన్నారు. అయితే పర్యావరణవేత్తలు మాత్రం ఆ చెత్త డంప్‌ను అక్కడి నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే 14 రకాల సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించిందని, వాటన్నింటినీ వేరే చోటకు తరలించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలదని తమిళనాడు అటవీశాఖ కార్యదర్శి సుప్రియా సాహు తెలిపారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న అన్ని వ్యర్థాల డంప్‌లను పరిశీలించాలని అన్ని జిల్లాల్లోని అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు జంతువులలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయని, ఇది వాటి పునరుత్పత్తిపై ప్రభావం చూపుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. అటవీశాఖ ఏటా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ఫలితం అంతంత మాత్రమే. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఇతర వన్యప్రాణుల కంటే ఎక్కువగా ఏనుగులకే హాని కలుగుతోంది. ఈ విషాద ఘటన వన్యప్రాణి సంరక్షణలో ప్లాస్టిక్ కాలుష్యం ఎంతటి పెను ప్రమాదమో మరోసారి గుర్తుచేస్తోంది.
MOST READ :
-
Seeds : నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా.. విత్తనాలు కొనే ముందు రైతులు ఏం చేయాలి..!
-
Devarakonda : చిరు వ్యాపారులకు సీరియస్ వార్నింగ్.. బందోబస్తు మధ్య రోడ్లపై తోపుడు బండ్ల తొలగింపు..!
-
Pensions : పింఛన్ దారులకు శుభవార్త ఎప్పుడో.. ఆశగా ఎదురుచూపు..!
-
Devarakonda : చిరు వ్యాపారులకు సీరియస్ వార్నింగ్.. బందోబస్తు మధ్య రోడ్లపై తోపుడు బండ్ల తొలగింపు..!
-
Hair : జుట్టు రాలుతుందా.. తెల్లబడుతుందా.. అయితే ఇంట్లోనే అద్భుత పరిష్కారాలు..!









