గ్రామ పంచాయతీలకు రానున్న మహర్దశ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు మహార్దశ రాబోతుంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.

గ్రామ పంచాయతీలకు రానున్న మహర్దశ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు మహార్దశ రాబోతుంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసినట్లుగా సమాచారం. రెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన నిధుల ఖర్చుల వివరాలను అందజేయాలని కోరినట్లు తెలుస్తోంది
దాంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని అందజేసే ప్రయత్నంలో ఉన్నారు. కేంద్రానికి రెండు, మూడు రోజుల్లో సమాచారం అందజేస్తే నిధులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రెండు సంవత్సరాల పాటు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల సుమారుగా 3000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి.
ఇటీవల సర్పంచ్ ఎన్నికలు పూర్తి కావడం వల్ల కొత్త పాలకవర్గాలు ఏర్పడటం పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దాంతో గ్రామ పంచాయతీలకు ఆయా ఖాతాలలో నిధులు జమ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పెండింగ్ బిల్లులు..?
ఇది ఇలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో సర్పంచులు సొంత నిధులతో గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం మారడం, సర్పంచుల పదవీకాలం ముగియడంతో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. కాగా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని మాజీ సర్పంచులు అనేక పర్యాయాలు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం నూతన పాలకవర్గాలు ఏర్పడటం, కేంద్రం నుంచి నిధులు విడుదలకు క్లియరెన్స్ రావడంతో ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులను చెల్లిస్తుందని ఆశతో మాజీ సర్పంచులు ఉన్నారు.









