Rythu Bharosa : ఏడాదంతా రైతు భరోసా.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!
తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కోసం ఏడాదంతా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. 2025 జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Rythu Bharosa : ఏడాదంతా రైతు భరోసా.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కోసం ఏడాదంతా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. 2025 జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఎకరానికి రెండు విడతలుగా 12,000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయాల్సి ఉంది. కాగా వానాకాలం సీజన్ లో రూ. 6000, యాసంగి సీజన్ లో 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తారు.పంట సీజన్ ముగిసే వరకు కూడా రైతు భరోసా పథకం కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తుంది. రెండు విడతలుగా రైతుల ఖాతాలలో జమ చేయాల్సిన రైతు భరోసా పథకం ఏడాదంతా ఆ పథకం డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
రైతు భరోసా పథకం యాసంగి సీజన్ లో సీజన్ కు ముందే విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదు. జనవరి మొదటి వారంలో విడుదల చేస్తామని ఒకసారి, సంక్రాంతికి విడుదల చేస్తామని మరోసారి, 26 జనవరి కి విడుదల చేస్తామని మరోసారి, మున్సిపల్ ఎన్నికల తర్వాత అంటూ మరోసారి ఇలా ఆ పార్టీ నేతలు దఫ దఫాలుగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. దాంతో రైతులు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూపులే సరిపోతున్నాయి. సీజన్ పూర్తయ్యేనాటికైనా రైతు భరోసా వస్తుందా.. అని ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొన్నది.
అధికారంలో ఉన్న మంత్రులే ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేయకుంటే రైతులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు. రైతు భరోసా నిధులు దుబారా కాకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం శాటిలైట్ సర్వే ఆధారంగా పంటలు సాగు చేసిన రైతులకు అందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా శాటిలైట్ సర్వే నిర్వహించారు.
కానీ ఇప్పటివరకు ఇంకా రైతులకు మాత్రం రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేయలేదు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజే రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తామని చెప్పారు. కానీ 16వ తేదీతో ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. అయినా ఇప్పటి వరకు రైతు భరోసా గురించి ఎలాంటి ప్రకటనలు లేవు. దాంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.
గత ప్రభుత్వం హయాంలో అమలు చేసిన రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 10000 రూపాయలను రెండు విడతలుగా అందజేసేవారు. ఆ సమయంలో రైతులు సాగు చేయడానికి ముందే రైతుల ఖాతాలలో నిధులు జమ అయ్యేవి. దాంతో ప్రభుత్వం అందజేసే ఆ నిధులు రైతులు సాగు పనులకు ఉపయోగించుకునేవారు. ప్రస్తుత ప్రభుత్వం అందజేసే రైతు భరోసా నిధులు ఎప్పుడు ఇస్తుందో..? అని ఎదురుచూపులే సరిపోతున్నాయి.









