Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునిజామాబాద్

 వరుణుడు కరుణించాలని.. భూలక్ష్మి దేవికి పూజలు..! 

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో భూలక్ష్మి దేవత ఉత్సవాలను గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వరుణుడు కరుణించాలని.. భూలక్ష్మి దేవికి పూజలు..! 

ఆర్మూర్, (మన సాక్షి):

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో భూలక్ష్మి దేవత ఉత్సవాలను గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.​పూర్వీకుల కాలం నాటి ఆచార వ్యవహారాల ప్రకారం.. ఏటా ఆరుద్ర నక్షత్రం (ఆరుద్ర కార్తె) ముగిసిన తర్వాత ఈ ప్రత్యేక పండుగను నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. ఇందులో భాగంగా భక్తులు భూలక్ష్మి దేవతతో పాటు తాతాయి దేవతలకు తీయని నైవేద్యాలను సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.

సకాలంలో వర్షాలు పడాలని, కాలం అనుకూలించి పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ఈ సందర్భంగా ఆ తల్లిని వేడుకున్నారు.ఏడాది పొడవునా ఆయురారోగ్యాలతో గ్రామాన్ని చల్లగా చూస్తూ, కోరిన కోర్కెలు నెరవేర్చే చల్లని తల్లిగా భూలక్ష్మి మాతను భక్తులు కొలుచుకున్నారు.​

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మగ్గిడి సూరి రెడ్డి మాట్లాడుతూ.. ఏటా నిర్వహించే సంప్రదాయం ప్రకారమే ఈ సంవత్సరం కూడా భూలక్ష్మి మాత, తాతాయి దేవతల ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఊరి పొలిమేరల్లోని పచ్చని పొలాల మధ్య మహిళలు, గ్రామస్తులు తీయని వంటకాలు (నైవేద్యాలు) వండి, అమ్మవారికి సమర్పించారని పేర్కొన్నారు.

అనంతరం అందరూ కలిసి అక్కడే సహపంక్తి భోజనాలు చేసి వెళ్తారని వివరించారు. ఈ విధంగా పూజలు చేయడం వల్ల భూలక్ష్మి దేవి కరుణాకటాక్షాలు ఊరిపై ఎల్లవేళలా ఉంటాయని, గ్రామానికి ఎలాంటి విపత్తులు రాకుండా కాపాడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు