TG : సేవ్ అవర్ హోమ్.. సేవ్ అవర్ ఫ్యూచర్.. చిన్నారుల వినూతన నిరసన..!
సేవ్ అవర్ హోమ్ సేవ్ అవర్ ఫ్యూచర్ మీ అధికార దాహానికి మా ఇళ్లను కూల్చొద్దు అని నినాదాలతో చిన్నారులు వినూతన నిరసన తెలిపారు.

TG : సేవ్ అవర్ హోమ్.. సేవ్ అవర్ ఫ్యూచర్.. చిన్నారుల వినూతన నిరసన..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
సేవ్ అవర్ హోమ్ సేవ్ అవర్ ఫ్యూచర్ మీ అధికార దాహానికి మా ఇళ్లను కూల్చొద్దు అని నినాదాలతో చిన్నారులు వినూతన నిరసన తెలిపారు. ఈ సంఘటన మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పేరుతో ఇల్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్మెంట్ బాధిత చిన్నారులు ప్రదర్శన చేశారు. వారిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మూసీ సుందరీకరణ కాదు.. ఇది రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ అన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.
ఆదివారం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇండ్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంఛార్జి కార్తీక్ రెడ్డి తదితరులు కలిసి పరామర్శించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు…కేసీఆర్ మమ్మల్ని ఇక్కడికి పంపించారు. కేసీఆర్కి మధు పార్క్ అపార్ట్‌మెంట్‌తో మర్చిపోలేని అనుబంధం ఉందని కేసీఆర్ ఈ అపార్ట్‌మెంట్‌కు మూడుసార్లు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ పాలసీ విజన్ డాక్యుమెంట్‌ను ఇక్కడి వార్ రూముల్లో కూర్చునే తయారు చేశారు.కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఇక్కడ మంచినీళ్లు లేక మీరు అపార్ట్‌మెంట్ ఖాళీ చేసి వెళ్లిపోతామంటే, అప్పటికప్పుడు హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించి ప్రత్యేక పైపులైన్ వేశారు.
ALSO READ : Miryalaguda : అప్రమత్తంగా ఉండి యూరియా బుక్ చేసుకోవాలి.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!
అప్పటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తో బటన్ ఆన్ చేయించి మరీ మీకు నీళ్లు ఇచ్చారు.సబితక్కకు మీరు ఒక్క ఫోన్ చేస్తే రాత్రికి రాత్రే మీ ముందు రోడ్డు వేయించారు. నాడు మూసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సుధీర్ రెడ్డి మూసీని క్లీన్ చేయించి మీకు దోమల బెడద లేకుండా చేశారు.కేసీఆర్ ఎప్పుడూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలా పెంచాలి, ప్రజలకు ఎలా మేలు చేయాలి అని ఆలోచించారు.ఈ అపార్ట్‌మెంట్‌ను నిలబెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం జేసీబీలతో దీన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు.కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై కనీస పాలసీ, ఒక విధానం లేదు. పూటకో తీరుగా వ్యవహరిస్తున్నారు.మూసీని శుద్ధి చేయాలని అందరూ కోరుకుంటారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పట్లోనే రూ. 3800 కోట్లతో ఎస్టీపీలను నిర్మించి ఆ పని ప్రారంభించింది. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలోకి వదిలేందుకు డీపీఆర్‌లను కూడా కేసీఆర్ ప్రభుత్వం తయారు చేయించింది. అప్పుడు మా ప్రభుత్వానికి ఏ ఒక్క ఇల్లూ కూల్చే ఆలోచన రాలేదు.అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక కచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉంటుంది.
సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకుందామని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఎల్టీపీఎస్ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఆలోచన చేశాడు. ఫార్మాసిటీ కోసం కేసీఆర్ 14,000 ఎకరాలు సేకరిస్తే.. దాన్ని ఫోర్త్ సిటీ అని పేరు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట మీ ఇండ్లు కూల్చి, మీ భూములు లాక్కొని.. వాటిని అంబానీకో, అదానీకో, మెగా కృష్ణారెడ్డికో కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు.
మేం మీ జేబులు నింపుకోవడానికి చేసే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పూర్తిగా వ్యతిరేకం.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్‌లో కట్టిన ఇల్లు ఒక్కటీ లేదు. కూల్చిన బతుకులు, కూల్చిన ఇండ్లు తప్ప మరేమీ లేవు.చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బుల్లేవంటాడు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, రైతులకు రైతుబంధు అడిగితే డబ్బుల్లేవంటాడు. గురుకులాల్లో అన్నం పెట్టక 162 మంది విద్యార్థులు చనిపోయారు. అడిగితే రాష్ట్రం దివాలా తీసింది, నా దగ్గర పైసల్లేవు నన్ను కోసుకు తింటారా అంటాడు.
ALSO READ : Suryapet : సూర్యాపేట జిల్లాలో నకిలీ పురుగుమందుల గుట్టురట్టు..!
మరి పైసలు లేకపోతే మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్‌లకు, మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జూబ్లీహిల్స్‌లో రూ. 100 కోట్లతో సీఎం క్యాంపు ఆఫీస్, రూ. 5 కోట్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మూడో క్యాంపు ఆఫీస్ కట్టుకోవడానికి పైసలు ఎక్కడివి?బడా కాంట్రాక్టర్లకు 20,000 కోట్లు బిల్లులు ఇచ్చారు. ఇప్పుడు ఎవరి జేబులు నింపడానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేదలకు ఇవ్వమంటే మాత్రం రేవంత్ రెడ్డికి డబ్బులు ఉండవా? మేం మూసీ శుద్ధికి వ్యతిరేకం కాదు. ఎస్టీపీలు కట్టు, మురుగునీరు రాకుండా చెయ్, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పైపులైన్లతో గోదావరి నీళ్లతో మూసీని శుద్ధి చెయ్..కానీ మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడాన్ని మాత్రమే మేం వ్యతిరేకిస్తున్నాం.
బాపు ఘాట్ వద్ద అహింసా మూర్తి గాంధీ విగ్రహం పెట్టి ఆరాధించాలి తప్ప.. ఆ విగ్రహం, నిర్మాణం పేరిట ప్రజల ఇండ్లు కూల్చుతూ, హింసాత్మక మార్గంలో భయాందోళనలకు గురిచేయడం దుర్మార్గం. ఇండ్లు ఖాళీ చేస్తారా, లేక జేసీబీ పంపి కూల్చమంటారా అని అధికారులు బెదిరిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఈ అపార్ట్‌మెంట్ అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ మాత్రమే కావచ్చు.. కానీ ఒక మధ్యతరగతి వాడికి రెక్కలు ముక్కలు చేసుకుని, బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు తెచ్చుకుని కట్టుకున్న జీవితకాలపు సొంతింటి కల అది.
ALSO READ : TG : తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పిటిసి వ్యవస్థ ఎత్తివేసేందుకు యత్నం.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ..!
ఇండ్లు కూల్చడమంటే ఇక్కడి బతుకులను కూల్చడమే. పసిపిల్లలు కంటిమీద కునుకు లేకుండా రేపు పరీక్షలు ఎలా రాస్తారు? నీకేంటి రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్‌లో 100 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటున్నావు. రోడ్డున పడేది ఈ పేదలు. ఇప్పటివరకు మూసీ ప్రాజెక్టుకు అసలు డీపీఆర్ లేదు. ఎఫ్‌టీఎల్ ఫిక్స్ కాలేదు. ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ రాలేదు. కనీసం సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ కూడా జరగలేదు. అలాంటప్పుడు నోటీసులు ఎలా ఇస్తారు?
ఇందాక ఒక సోదరి మాట్లాడుతూ ‘వి వాంట్ కేసీఆర్ బ్యాక్’ అని అన్నారు.
రాష్ట్రంలో కచ్చితంగా వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. అప్పుడు ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని బాగు చేసి చూపిస్తాం.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల రేట్లు పడిపోయాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. ఎక్కడ చూసినా దోపిడీయే. హైడ్రా ముసుగులో దోపిడీ, మూసీ ప్రాజెక్టు విషయంలో దోపిడీ, ఫ్యూచర్ సిటీ పేరిట, సెంట్రల్ యూనివర్సిటీ పేరిట, భూముల అమ్మకాల పేరిట అంతా దోపిడీ చేస్తున్నారు.
మేం కేవలం రాజకీయాల కోసం కాదు, ప్రజల కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే మేం మాట్లాడుతున్నాం. ప్రభుత్వం బేషజాలకు, పట్టింపులకు పోకుండా.. మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
పక్కనే ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేసుకోండి. అంతే కానీ మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను ఛిద్రం చేయకండి. మా ఇండ్లు కూలగొట్టే బదులు.. మా నీళ్ల ట్యాంకులో విషం కలిపితే మేమంతా తాగి చచ్చిపోతాం.. మమ్మల్ని చంపండి అని ఇక్కడ ఒక తల్లి అన్న మాట నన్ను ఎంతగానో కలచివేసింది. మీరెవరూ ఆందోళన చెందకండి, భయపడకండి. రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అక్రమాలపై ఎంత దూరమైనా వెళతాం. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పక్షాన మీకు అండగా నిలబడి, చట్టపరంగా పూర్తి స్థాయి పోరాటం చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ మాజీ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ , స్థానిక నాయకులు, అపార్ట్మెంట్ బాధితులు, తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : Viral Video : పాత సామాను తెచ్చిన అదృష్టం.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..!










