Breaking : కవల ఆడపిల్లల హత్య కేసు కీలక మలుపు.. కన్నతండ్రితో సహా నలుగురు అరెస్ట్..!
సొంత బిడ్డలనే కాలయముడిలా మారి బావిలో ముంచి చంపిన దారుణ ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. కన్నతండ్రితో పాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Breaking : కవల ఆడపిల్లల హత్య కేసు కీలక మలుపు.. కన్నతండ్రితో సహా నలుగురు అరెస్ట్..!
కరీంనగర్, మనసాక్షి :
సొంత బిడ్డలనే కాలయముడిలా మారి బావిలో ముంచి చంపిన దారుణ ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. కన్నతండ్రితో పాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబందించిన వివరాలను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు.
కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ కి చెందిన కచ్చు శ్రీశైలం (28), ప్రతిమ మెడికల్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. 2020లో మౌనికతో ఇతనికి వివాహం కాగా, 2022లో వీరికి కవల ఆడపిల్లలు (గీతంశి, గీతన్విక) జన్మించారు. అయితే మొదటి నుండి మగపిల్లవాడు కావాలని కోరుకున్న శ్రీశైలంకు, ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదు.
సుమారు 2 కోట్ల విలువైన ఆస్తి ఆడపిల్లల పెళ్లిళ్లకే సరిపోతుందని భావించిన శ్రీశైలం, తన తల్లిదండ్రులు అశోక్, లావణ్య మరియు తమ్ముడు రాకేష్‌తో కలిసి పిల్లలను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. ఏప్రిల్ 3న, పథకం ప్రకారం నిందితుడు శ్రీశైలం తన భార్యను ఇంట్లోనే ఉండమని చెప్పి, బలవంతంగా ఇద్దరు కుమార్తెలను మోటార్ సైకిల్‌పై పొలం వద్దకు తీసుకెళ్లాడు.
చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి, నలుగురు నిందితులు ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం, శ్రీశైలం ఇద్దరు చిన్నారులను వ్యవసాయ బావిలోకి తోసివేశాడు. నీటిలో మునిగిపోతున్న గీతంశి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుండగా, తనే బావిలోకి దిగి ఆమెను నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, పిల్లలను కాపాడబోతున్నట్లుగా నటిస్తూ కేకలు వేశాడు. నిందితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులు గోపాల్‌పూర్‌లో తలదాచుకున్నట్లు గుర్తించారు. ఆదివారం (ఏప్రిల్ 5) మధ్యాహ్నం నిందితులను అదుపులోకి తీసుకోగా, వారు తమ నేరాన్ని అంగీకరించారు. కచ్చు శ్రీశైలం (తండ్రి), కచ్చు అశోక్ (తాత) కచ్చు లావణ్య (నానమ్మ) కచ్చు రాకేష్ (బాబాయ్) లను పోలీసులు అరెస్టు చేశారు.
హత్యకు ఉపయోగించిన గ్లామర్ మోటార్ సైకిల్ మరియు ఒక వివో మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ కుమార్, సీఐ నిరంజన్ రెడ్డి మరియు సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అభినందించారు. గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.









