Karimnagar : కరీంనగర్‌లో మరో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం..!
కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు వరుసగా అగ్నిప్రమాదాలకు గురవుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది.

Karimnagar : కరీంనగర్‌లో మరో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం..!
డిపో 2లో తెల్లవారు జామున చెలరేగిన మంటలు
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు వరుసగా అగ్నిప్రమాదాలకు గురవుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల అలుగునూరు ఎల్‌ఎండీ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఈవీ బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన మరువకముందే, తాజాగా బుధవారం తెల్లవారు జామున కరీంనగర్-2 ఆర్టీసీ డిపోలో నిలిపి ఉంచిన మరో ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
వివరాల్లోకి వెళ్తే..డిపో-2 ప్రాంగణంలో నిలిపి ఉంచిన టీజీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ఉదయం వేళ షార్ట్ సర్క్యూట్ లేదా బ్యాటరీ లోపం కారణంగా అకస్మాత్తుగా మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి వేగంగా వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడం, డిపోలోనే నిలిపి ఉంచడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
మంటలను గమనించిన డిపో సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక పరికరాలతో శ్రమించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
అయితే ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా దగ్ధమైంది. గడిచిన 15 రోజుల వ్యవధిలోనే కరీంనగర్ రీజియన్‌లో ఇది రెండో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం కావడంతో, ఈవీ బస్సుల భద్రతపై ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ సాంకేతిక, బ్యాటరీ లోపాలపై ఆర్టీసీ అధికారులు కాంట్రాక్ట్ సంస్థతో కలిసి లోతైన విచారణ ప్రారంభించారు.










