Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Hyderabad : కస్టడీ నుంచి పరారైన నిందితుడు.. హర్యానాలో అరెస్ట్..!

నార్సింగి పోలీస్ స్టేషన్ కస్టడీ నుంచి తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి నిందితుడు ముజఫర్‌ను సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

Hyderabad : కస్టడీ నుంచి పరారైన నిందితుడు.. హర్యానాలో అరెస్ట్..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

నార్సింగి పోలీస్ స్టేషన్ కస్టడీ నుంచి తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి నిందితుడు ముజఫర్‌ను సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) రమేష్ ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.

బాత్‌రూమ్ అద్దాలు పగలగొట్టి పరారి :

కొద్దిరోజుల క్రితం నార్సింగి పోలీసులు గంజాయి కేసులో ముజఫర్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం స్టేషన్‌లో ఉంచారు. అయితే, పోలీసుల కన్నుగప్పి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన నిందితుడు, అక్కడి కిటికీ అద్దాలను పగలగొట్టి అత్యంత నాటకీయంగా పోలీస్ కస్టడీ నుంచి పరారయ్యాడు. పోలీస్ స్టేషన్ నుంచే నిందితుడు తప్పించుకోవడంతో సైబరాబాద్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.

నిందితుడి ఆచూకీ కోసం సీపీ రమేష్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక పరిజ్ఞానం, నిఘా వర్గాల సమాచారంతో నిందితుడి కదలికలను పోలీసులు నిరంతరం పర్యవేక్షించారు. ఈ క్రమంలో నిందితుడు ముజఫర్ తన భార్యతో కలిసి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఢిల్లీకి పారిపోతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.

హర్యానాలో అదుపులోకి :

వెంటనే అలర్ట్ అయిన సైబరాబాద్ ప్రత్యేక బృందాలు నిందితుడిని వెంబడించాయి. హర్యానా సరిహద్దుల్లో నిందితుడిని, అతని భార్యను పోలీసులు విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

సీపీ రమేష్ ప్రకటన:

“నిందితుడు ఎంతటి చాకచక్యంగా తప్పించుకున్నా, అంతే వేగంగా సాంకేతికతను ఉపయోగించి హర్యానాలో పట్టుకోవడం జరిగింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు ఉంటాయని” సీపీ స్పష్టం చేశారు. కేసుకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కూడా అంతర్గత విచారణ జరుపుతామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు