Hyderabad : మియాపూర్‌లో డెలివరీ బాయ్‌ను బెదిరించి దోపిడీ.. ఒకరు అరెస్ట్..!
మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించి ఓ నిందితుడిని అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దోపిడీ నేరాలకు పాల్పడుతున్న బసోడి అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad : మియాపూర్‌లో డెలివరీ బాయ్‌ను బెదిరించి దోపిడీ.. ఒకరు అరెస్ట్..!
శేరిలింగంపల్లి, మన సాక్షి
మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించి ఓ నిందితుడిని అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దోపిడీ నేరాలకు పాల్పడుతున్న బసోడి అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.400 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. జెప్టో సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న యువకుడు జూలై 13 అర్ధరాత్రి సమయంలో బ్యాటరీతో నడిచే డెలివరీ బైక్‌పై మియాపూర్‌లోని గోపాల్‌రావు నగర్ ప్రాంతానికి ఆర్డర్ అందించేందుకు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో శిల్పా అవెన్యూ కాలనీ సమీపంలో స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డగించారు. అనంతరం దాడి చేసి, చంపేస్తామని బెదిరించి మొబైల్ ఫోన్‌ను అన్‌లాక్ చేయించారు. మొబైల్ ద్వారా అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.900ను తమ ఖాతాకు బదిలీ చేసుకున్నారు. అలాగే జేబులో ఉన్న రూ.5 వేల నగదును లాక్కొని పరారయ్యారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి నిందితుడు బసోడి అభిషేక్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిసింది. పోలీసుల సమాచారం ప్రకారం బసోడి అభిషేక్‌పై గతంలో మధురానగర్, మియాపూర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి.
రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సహచరులతో కలిసి దోపిడీలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాత్రి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.









