Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ..!

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ  మండలం పరిధిలోని గుండాల ఏకలవ్య గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మిక తనిఖీ చేశారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ..!

వెల్దండ, మన సాక్షి:

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ  మండలం పరిధిలోని గుండాల ఏకలవ్య గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులను పరిశీలించారు.

మొదట భోజనశాల, డైనింగ్ హాల్‌ను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం నాణ్యత, మెనూ అమలు, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. వంటశాలలో ఆహార పదార్థాల నిల్వ, తాగునీటి వినియోగం, వంట ప్రక్రియలను తనిఖీ చేసి నాణ్యమైన ఆహారం అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. తరగతి గదులను సందర్శించి బోధన తీరును పరిశీలించిన కలెక్టర్, ఉపాధ్యాయుల బోధనా విధానాలు, డిజిటల్ లెర్నింగ్ వినియోగం, విద్యార్థుల హాజరు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థులకు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని అంచనా వేసిన కలెక్టర్, సీబీఎస్ఈ సిలబస్‌కు అనుగుణంగా బోధన సమర్థవంతంగా కొనసాగాలని సూచించారు. భావనాత్మక అవగాహన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పోటీ పరీక్షలకు అవసరమైన సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

అలాగే విద్యార్థుల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన,ఆత్మవిశ్వాసం పెంపొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు, సిబ్బంది తాగునీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఆయన పాఠశాల సమీపంలోని గుట్ట ప్రాంతాన్ని తొలగించి ప్రాంగణంలోనే బోరు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత శాఖలతో సమన్వయం చేసి త్వరితగతిన బోరు తవ్వకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు, క్రీడా సామగ్రి, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్ వినియోగం వంటి అంశాలపై కూడా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులకు అత్యున్నత స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏకలవ్య గురుకుల పాఠశాలలను నిర్వహిస్తోందని అన్నారు.చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని, ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, ఆహారం వంటి ప్రాథమిక అవసరాల విషయంలో ఎలాంటి లోపాలు ఉండరాదని, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

పాఠశాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి జిల్లా యంత్రాంగానికి సమర్పించాలని అధికారులకు సూచించారు.ఈ సందర్శలో ఆయనతో పాటు కల్వకుర్తి ఆర్డిఓ జనార్దన్ రెడ్డి,వెల్డండ తహశీల్దార్ కార్తిక్ కుమార్, ఎంఈఓ చంద్రుడు నాయక్, పాఠశాల ప్రిన్సిపల్,వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు