District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. సూర్యాపేట హైవే పై అలా చేస్తే శిక్షలు, జరిమానాలు..!
రోడ్డు ప్రమాదంలో పోయే ప్రతి ప్రాణం అత్యంత విలువైందని, ఇకపై రహదారి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. సూర్యాపేట హైవే పై అలా చేస్తే శిక్షలు, జరిమానాలు..!
సూర్యాపేట, మనసాక్షి :
రోడ్డు ప్రమాదంలో పోయే ప్రతి ప్రాణం అత్యంత విలువైందని, ఇకపై రహదారి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులపై వ్యక్తిగత శిక్షలు, భారీ జరిమానాలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ హెచ్చరించారు.
రాజస్థాన్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన భారీ ప్రమాదాలను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో.. జిల్లా స్థాయిలో రవాణా, రెవెన్యూ, విద్య, వైద్యం, పోలీస్, ఆర్ అండ్ బి, పంచాయతీ, నేషనల్ హైవే అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను వెంటనే గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.
వచ్చే 45 రోజుల్లోగా ప్రమాదకర ప్రాంతాల పూర్తి జాబితాను సిద్ధం చేయాలని, 4 నెలల్లోగా ఆయా ప్రాంతాల్లో హై-ఇంటెన్సిటీ ఎల్ఈడి లైట్లు, స్పీడ్ కెమెరాలు, రెట్రో-రిఫ్లెక్టివ్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఇవ్వాలన్నారు.
హైవేలపై అక్రమ పార్కింగ్ చేస్తే చలానానే :
జాతీయ రహదారుల మెయిన్ రోడ్డు, పక్కన ఉన్న షోల్డర్స్పై భారీ వాహనాలను పార్క్ చేయడంపై పూర్తి నిషేధం అని తెలిపారు.
వాహనాలను కేవలం నిర్దేశిత లే-బై ప్రాంతాల్లో లేదా పెట్రోల్ బంకుల వద్ద మాత్రమే ఆపాలని సూచించారు. ప్రతి 75 కిలోమీటర్లకు ఒక లే-బై సదుపాయం ఉండేల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిబంధనలు మీరితే ఈ-చలానా, జీపీఎస్ ఆధారిత ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైవేల పక్కన నిబంధనలకు విరుద్ధంగా వెలసిన దాబాలు, హోటళ్లు, వాణిజ్య నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. కొత్తగా ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని, పాత అనుమతులను 30 రోజుల్లోగా సమీక్షించి, అక్రమంగా ఉంటే రద్దు చేయాలని తెలిపారు. డ్రోన్ సర్వేల ద్వారా ఆక్రమణలను తొలగించాలన్నారు.
రూ.1.5 లక్షల వరకు ఉచితం :
ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు వైద్యం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి 75 కిలోమీటర్లకు ఒక బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని, ట్రామా కేర్ సెంటర్లను మ్యాపింగ్ చేసి, బాధితులకు రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు.
ప్రతి 15 రోజులకోసారి రివ్యూ :
రోడ్డు భద్రతపై కేవలం మాటలు కాకుండా చేతల్లో చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి 15 రోజులకోసారి ఫాలో-అప్ మీటింగ్ ఉంటుందని, ఆర్టికల్ 21 ప్రకారం పౌరుల జీవించే హక్కును కాపాడటమే అధికారుల తొలి ప్రాధాన్యత కావాలని ఆదేశించారు. కార్యక్రమం లో డిఆర్ఓ ప్రేమ్ రాజ్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, ఆర్టీవో పురుషోత్తం రెడ్డి, డిపిఓ యాదగిరి, ఆర్ అండ్ బి ఈఈ సీతారామయ్య, డీఈఓ అశోక్, మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.









