Karimnagar : కరీంనగర్‌లో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. దంపతులను బంధించి భారీ దోపిడీ..!
కరీంనగర్ నగరంలో శాంతిభద్రతలపై ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తూ అర్ధరాత్రి వేళ మరో భారీ సాయుధ దోపిడీ జరిగింది.

Karimnagar : కరీంనగర్‌లో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. దంపతులను బంధించి భారీ దోపిడీ..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ నగరంలో శాంతిభద్రతలపై ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తూ అర్ధరాత్రి వేళ మరో భారీ సాయుధ దోపిడీ జరిగింది. నగరంలోని ప్రధాన ప్రాంతమైన భగత్ నగర్‌లో నివసిస్తున్న అజ్మత్ అలీ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన సుమారు ఎనిమిది మంది దుండగులు నకిలీ తుపాకులు, కత్తులతో వీరంగం సృష్టించారు.
ప్రాథమిక సమాచారం మరియు బాధితుల కథనం ప్రకారం, మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటి యజమాని గేటు తీయగానే పొంచివున్న దుండగులు ఒక్కసారిగా లోపలికి చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు, వారి కుమార్తె సహా నలుగురు కుటుంబ సభ్యులను తుపాకులు, కత్తులతో బెదిరించడమే కాకుండా, ప్రతిఘటించిన వృద్ధుడిపై గన్‌తో తలపై దాడి చేసి గాయపరిచారు.
బాధితులు కేకలు వేయకుండా వారి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి ఒకే గదిలో బంధించారు. దాదాపు గంటన్నర పాటు ఇంట్లోనే తిష్టవేసిన దొంగలు, బీరువాలోని సొత్తుతో పాటు వృద్ధ దంపతుల ఒంటిపై ఉన్న బంగారు గొలుసులు, ఉంగరాలు, చివరికి చెవి కమ్మలను కూడా బలవంతంగా కట్ చేసి లాక్కెళ్లారు. మొత్తం కలిపి సుమారు 66 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి మరియు రూ. 21 లక్షల నగదును దుండగులు లూటీ చేశారు.
దోపిడీ అనంతరం నిందితులు పారిపోవడానికి వీలుగా పార్కింగ్‌లో ఉన్న రెండు ద్విచక్రవాహనాలను (బైక్‌లను) కూడా దొంగిలించి, ఇంటి తలుపులు బయటి నుంచి లాక్ చేసి పరారయ్యారు. ఇటీవలే నగర నడిబొడ్డున పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌లోకి చొరబడి కాల్పులు జరిపి భారీగా బంగారం దోచుకెళ్లిన అంతర్రాష్ట్ర ముఠా ఘటనను మరిచిపోకముందే, మళ్లీ అదే తరహాలో తుపాకులతో వచ్చి నివాస గృహంలో దోపిడీకి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనతో భగత్‌నగర్‌తో పాటు కరీంనగర్ నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వరుసగా జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో పోలీసు పెట్రోలింగ్‌ను మరింత కట్టుదిట్టం చేసి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీసులు వెంటనే క్లూస్ టీమ్‌తో రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, స్థానిక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, ఈ ఘటనపై బాధితుల కుటుంబానికి చెందిన ఒక సన్నిహిత బంధువుపైనే ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేసిన తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.











