ఎక్కుతుండగానే పైకి కదిలిన లిఫ్ట్.. తలుపుల మధ్య ఇరుక్కొని మహిళ మృతి..!
లిఫ్ట్ తలుపులు పూర్తిగా మూసుకోకముందే పైకి కదలడంతో లిఫ్ట్, ప్రవేశ ద్వారం మధ్య ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన చందానగర్‌లో చోటుచేసుకుంది.

ఎక్కుతుండగానే పైకి కదిలిన లిఫ్ట్.. తలుపుల మధ్య ఇరుక్కొని మహిళ మృతి..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
లిఫ్ట్ తలుపులు పూర్తిగా మూసుకోకముందే పైకి కదలడంతో లిఫ్ట్, ప్రవేశ ద్వారం మధ్య ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన చందానగర్‌లో చోటుచేసుకుంది. అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లోని చాట్వాజ్ మెన్షన్ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం ఉదయం ఘటన జరిగింది. నల్లగండ్ల ఎస్సీ కాలనీకి చెందిన ధాడి శ్రీనివాస్ (46) తన భార్య అనసూయ (43)తో కలిసి తన మేనమామ ధాడి గోవింద్‌ను పరామర్శించేందుకు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు.
ఉదయం 11 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో లిఫ్ట్ వద్దకు చేరుకున్నారు. శ్రీనివాస్ ముందుగా లిఫ్ట్‌లోకి వెళ్లగా. అనసూయ లోపలికి ఎక్కుతున్న సమయంలోనే లిఫ్ట్ అకస్మాత్తుగా పైకి కదిలినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ కాలు లిఫ్ట్‌లో పెట్టి మరో కాలును లోపలికి పెట్టె సమయంలో తలుపులు పూర్తిగా మూసుకోకముందే లిఫ్ట్ కదలడంతో అనసూయ లిఫ్ట్, ప్రవేశ ద్వారం మధ్య ఇరుక్కుపోయింది.
దీంతో నడుముతో పాటు శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాస్ కేకలు వేయడంతో అపార్ట్‌మెంట్ వాసులు అక్కడికి చేరుకుని ఆమెను బయటకు తీశారు. వెంటనే చందానగర్‌లోని అర్చనా ఆసుపత్రికి తరలించగా.అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో లిఫ్ట్ మరమ్మతు పనులు జరుగుతున్నాయని శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. లిఫ్ట్ టెక్నీషియన్ అనిల్‌కుమార్ ప్రధాన విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండానే మరమ్మతులు చేపట్టారని ఆరోపించాడు.
అంతేకాకుండా లిఫ్ట్ వద్ద నివాసితులను అప్రమత్తం చేసేందుకు కాషన్ లేదా వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేయలేదని తెలిపాడు.టెక్నీషియన్ అనిల్‌కుమార్‌తో పాటు అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులు రామ్‌రెడ్డి, యోగేందర్, వెంకట్‌రెడ్డి, లిఫ్ట్ మెయింటెనెన్స్ కంపెనీ యజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని శ్రీనివాస్ ఆరోపించాడు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.









