Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత చేపట్టిన రీ సర్వేకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి..!

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత చేపట్టిన రీ సర్వేకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి అక్టోబర్ చివరి నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత చేపట్టిన రీ సర్వేకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి..!

అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలి

– రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

– ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలోని సమస్యలు పరిష్కరిస్తాం

– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సూర్యాపేట,ఆగస్టు 29, మన సాక్షి:

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత చేపట్టిన రీ సర్వేకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి అక్టోబర్ చివరి నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ లో రెండో విడత సర్వే చేపట్టేందుకు సంసిద్ధం కావాలని చెప్పారు. దశాబ్దాల తరబడి గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి పారదర్శకంగా అమలు చేస్తున్నదని , అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని కోరారు.

భూములకు సంబంధించిన అంశాలన్నింటిని సానుకూల దృక్పథంతో ఆలోచించి పరిష్కరించినందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని, తద్వారా రెవెన్యూ వ్యవస్థ పై నమ్మకం పెరిగేలా చూడాలన్నారు.

శనివారం సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే మరియు గృహ నిర్మాణ శాఖల సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మొదటి విడత సర్వే చేపట్టిన70 గ్రామాలలో సర్వేను పారదర్శకంగా నిర్వహించి గ్రామ సరిహద్దులు నిర్ధారించడం పై దృష్టి సారించాలని, కలెక్టర్లు, ఆదనపు కలెక్టర్లు ప్రత్యక్షంగా వీటిని పర్యవేక్షించాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని చెప్పారు.

ALSO READ : అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ వెలుగులు..!

ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని నిర్ణయించిన తేదీ కంటే ముందే సర్వే పూర్తిచేసేలా చూడాలని ,భూముల సమస్యల పరిష్కారానికి ప్రజలు పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా చూడాలని కోరారు. అలాగే రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, చట్టానికి లోబడి వాటిని కూడా పరిష్కరించేందుకు సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. సర్వే కోసం నియమించిన లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని, విధులకు రాని వారిని అవసరమైతే తొలగించి వారి లైసెన్సు క్యాన్సల్ చేయాలని మంత్రి సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లో భాగంగా మొదటి విడత మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లలో ఎల్ 1,ఎల్ 2,ఎల్ 3 సమస్యలను పరిష్కరించడంలో భాగంగా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేలా సమస్యలను సరిచేసేలా పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. 15 రోజుల్లో ఎల్ 3 సమస్యలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 2 వ విడత ఇలాంటి సమస్యలు రాకుండా ఇండ్ల మంజూరు సమయంలోనే ఇబ్బందులు రాకుండా శాసనసభ్యులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంజూరు ఉత్తర్వులను ఆధారం చేసుకుని ఎక్కడైనా ఇందిరమ్మ ఇంటికి ఒక బిల్లు వచ్చి ఉండి తదుపరి బిల్లు రానట్లయితే సంబంధితులపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు.

ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు పేదవాడికి అన్ని పన్నులు, రవాణాచార్జీలు కలుపుకొని 230 రూపాయలకే సిమెంట్ బస్తా ఇచ్చే విధంగా సిమెంట్ కంపెనీలతో మాట్లాడి నిర్ణయించడం జరిగిందని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

ALSO READ : ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్.. మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే..!

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఇల్లనేది ప్రతి పేదవాడికి ఎంతో ముఖ్యమని, మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మిగిలిపోయిన, అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన ఇండ్లను దసరా లోపే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేలా అధికారులు చూడాలని కోరారు. ఎల్ 1, ఎల్ టు, ఎల్ త్రీ సమస్యలు పరిష్కరించాలని, నల్గొండ పట్టణంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తో కోరారు.

భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భూభారతి ద్వారా పేదవారికి సంబంధించిన నిజమైన భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల కు సంబంధించిన ఎల్ ,3 మస్యలు పరిష్కరించాలన్నారు. నకిరేకల్ కు మంజూరైన జిల్లా కోర్టు విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ఎల్ 3
సమస్యల పరిష్కారంలో జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని కోరారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ కార్యాలయం , అలాగే అడవిదేవులపల్లి మండలంలో తహసిల్దార్ కార్యాలయాల మంజూరు, మిర్యాలగూడ మున్సిపాలిటీ అయినందున మిర్యాలగూడ కు ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడుతూ శాలిగౌరారం మండలం మాదారం చెరువు శిఖం భూమి ఆక్రమణ, ఇంద్రమ్మ ఇండ్లకు ఇసుక సమస్యను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.

ALSO READసీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ.. అనంతరం ఏమన్నారంటే.!

శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ సాదా బైనమాల సమస్యల పరిష్కారంలో లింక్ డాక్యుమెంట్లు అడుగుతున్నారని, అలాగే ఆర్ఓఎఫ్ ఆర్ సమస్యలను పరిష్కరించాలని, ఇందిరమ్మ ఇండ్ల కు సంబంధించి ముగ్గు పోసుకున్న వారికి ఇండ్లు ఇవ్వాలని కోరారు .
మరో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సాదా బైనామాల సమస్యలు పరిష్కారం కావడం లేదని, నక్ష మ్యాపులాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఇందిరమ్మ ఇండ్ల ఎల్ 3 సమస్యలను సరళికృతం చేయాలని కోరారు.

నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఆర్ అండ్ ఆర్ సమస్యలను పరిష్కరించాలని, అలాగే అటవీ ,అసైన్డ్ పట్టాల లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని, ఎల్ -3 సమస్యలు పరిష్కరించాలని కోరారు.
సమావేశం ప్రారంభమైన వెంటనే రెవెన్యూ సిసిఎల్ఏ సెక్రటరీ లోకేష్ కుమార్, ల్యాండ్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ఎండి గౌతమ్ లు వారి వారి శాఖలకు సంబంధించిన అంశాలను వివరించారు.

సమీక్షలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి సూర్యాపేట ,యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల నుండి కొంతమంది తహసిల్దారులతో రీసర్వేపై సమీక్షిస్తూ సర్వే జరుగుతున్న తీరు, సమస్యలు, ప్రజల నుండి వస్తున్న అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు తప్పనిసరిగా సర్వే జరుగుతున్న గ్రామసభలకు హాజరుకావాలని ఆదేశించారు.

నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, వారి జిల్లాలకు సంబంధించిన సమీక్షలో వారు తీసుకున్న చర్యలపై మంత్రులకు వివరించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్ రిజిస్టర్లు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీలు, తహసిల్దారులు, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు