District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. లంచం డిమాండ్ చేసిన ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్..!
పదవీ విరమణ పొందిన తోటి ఉద్యోగిణి పింఛను ప్రతిపాదనలు పంపడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు లంచం డిమాండ్ చేసిన ముగ్గురు ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కొరడా ఝళిపించారు.

District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. లంచం డిమాండ్ చేసిన ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్..!
సూర్యాపేట, మనసాక్షి
పదవీ విరమణ పొందిన తోటి ఉద్యోగిణి పింఛను ప్రతిపాదనలు పంపడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు లంచం డిమాండ్ చేసిన ముగ్గురు ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కొరడా ఝళిపించారు. ఈ మేరకు సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్‌లను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు.
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభివృద్ధి శాఖలో విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగిణి గత మార్చి నెలలో పదవీ విరమణ పొందారు. అయితే ఆమెకు రావాల్సిన పింఛను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తాలూకు ఫైలును (పెన్షన్ ప్రపోజల్) ఎప్పటికప్పుడు పై కార్యాలయానికి పంపించాల్సి ఉండగా.. గతంలో పని చేసిన అధికారిణితో పాటు సంబంధిత విభాగ ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారు.
ఆ శాఖకు చెందిన గతంలో పనిచేసిన సీనియర్ అధికారిణితో .పాటు సీనియర్ అసిస్టెంట్ జి.రవివర్మ, జూనియర్ అసిస్టెంట్ బి.యాదగిరి, అటెండర్ బి.రాము బాధితుడి నుంచి పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేశారు. అడిగిన మొత్తం ఇస్తేనే ఫైలుపై సంతకాలు చేసి ముందుకు పంపుతామని చెప్పడంతో. ఆ మొత్తం ఇచ్చేందుకు బాధితురాలు నిరాకరించడంతో నెలల తరబడి ఫైల్ కదలకపోవడంతో
కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
Also Read : Miryalaguda : మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని వ్యక్తి మృతి..!
సర్వీసు ముగిసి నెలలు గడుస్తున్నా లంచం ఇవ్వలేదనే సాకుతో తన పెన్షన్ ఫైలును కదలకుండా అడ్డుకుంటున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఆవేదనపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్.. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులు జరిపిన విచారణలో ఉద్యోగులు లంచం డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, విధుల్లో తీవ్ర అలసత్వం, బాధ్యతారాహిత్యం ప్రదర్శించారని తేలింది.
విచారణ నివేదిక ఆధారంగా సీనియర్ అసిస్టెంట్ రవివర్మ, జూనియర్ అసిస్టెంట్ యాదగిరి, అటెండర్ రాములను తక్షణమే సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు వెలువరించారు. దింటితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అధికారిణి పై సైతం సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
విధుల్లో అలసత్వం వహించినా, ప్రజలను లేదా విశ్రాంత ఉద్యోగులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ లంచాల కోసం వేధించినా ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఈ సందర్భంగా హెచ్చరించారు.









