Karimnagar : 30న కరీంనగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. భద్రత, ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 30న రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.

Karimnagar : 30న కరీంనగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. భద్రత, ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
కరీంనగర్ బ్యూరో , మనసాక్షి :
కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 30న రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, సీఎం భద్రతా అధికారులు నూతన కలెక్టరేట్ ప్రాంగణాన్ని పరిశీలించారు.
కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలిప్యాడ్, తెలంగాణ తల్లి విగ్రహం, నూతన కలెక్టరేట్ భవనం, సమావేశ మందిరం, జిల్లా కలెక్టర్ నూతన చాంబర్, పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సిపి, సీఎం భద్రతా అధికారులు పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక, కార్యక్రమాల నిర్వహణ, కాన్వాయ్ రాకపోకలు, తిరుగు ప్రయాణం వరకు చేపట్టాల్సిన భద్రతా చర్యలను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో భద్రత, ప్రోటోకాల్, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు నిర్వహించే అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్ (ఏ.ఎస్.ఎల్) సమీక్షలో భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, హెలిప్యాడ్, సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, అత్యవసర వైద్య సేవలు, అగ్నిమాపక ఏర్పాట్లు, ప్రోటోకాల్ తదితర అంశాలను సమీక్షించారు.
సీఎం పర్యటించే ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన విధులను సమన్వయంతో తూచా తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. నిర్దిష్ట సమయంలోగా ఏర్పాట్లను పూర్తి చేసి, ప్రతి అంశాన్ని పరిశీలించి ధ్రువీకరించాలని సూచించారు.
ఎలాంటి తప్పిదాలు, నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యేకంగా రోడ్లు–భవనాలు, అటవీ, విద్యుత్, ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కేటాయించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
హెలిప్యాడ్ వద్ద సీఎం స్వాగతం నుంచి తిరిగి హెలికాప్టర్ బయలుదేరే వరకు ప్రతి దశలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్, గౌరవ వందనం, భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విధులు కేటాయించిన రోప్ సిబ్బంది, రూట్ అధికారులు ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలని సూచించారు.
అవసరమైన ప్రాంతాల్లో భారీ కేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు పార్కింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పోలీసు సిబ్బందికి సహకరిస్తూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో షర్మిల, సీఎంవో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు ఎస్పీ రామచందర్‌రావు, డీఎస్పీలు
దుర్శేటి రఘు చందర్, శ్యామ్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










