టోల్‌ప్లాజా వద్ద రూ.20 లక్షల డ్రగ్స్ పట్టివేత..!
డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శంషాబాద్ డీసీపీ కె.నారాయణ రెడ్డి హెచ్చరిస్తూ మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

టోల్‌ప్లాజా వద్ద రూ.20 లక్షల డ్రగ్స్ పట్టివేత..!
– 170 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్ స్వాధీనం
(ఆమనగల్లు – ఇమ్రాన్), మనసాక్షి:
డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శంషాబాద్ డీసీపీ కె.నారాయణ రెడ్డి హెచ్చరిస్తూ మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్ఓటీ మహేశ్వరం జోన్ బృందం కడ్తాల్ పోలీసులు సంయుక్తంగా కడ్తాల్ టోల్‌ప్లాజా సమీపంలో తనిఖీలు నిర్వహించి సుమారు రూ.20 లక్షల విలువైన 170 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో కేరళ రాష్ట్రం కాసరగోడ్ జిల్లాకు చెందిన బవుదల్ ఉమ్మర్ అబ్దుల్ అజీజ్ (34) హంసత్ షానస్ (32)లను అరెస్టు చేశారు. ముంబై నుంచి నల్లరంగు మారుతి స్విఫ్ట్ కారులో డ్రగ్స్‌ను కడ్తాల్‌కు తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేశారు. నిందితుల నుంచి మూడు ప్యాకెట్లలో ఉన్న 170 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్‌తో పాటు కారు రెండు ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో ముంబైకి చెందిన సిద్ధిఖ్ సూచనల మేరకు డ్రగ్స్‌ను తీసుకొచ్చి కడ్తాల్ టోల్‌ప్లాజా వద్ద రింకు ఠాగూర్‌కు అప్పగించాల్సి ఉందని నిందితులు వెల్లడించి నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కారు నంబర్ ప్లేట్లను తొలగించి నట్లు పేర్కొన్నారు.ఈ కేసులో సరఫ రాదారుగా భావిస్తున్న సిద్ధిఖ్ డ్రగ్స్ స్వీకరించాల్సిన రింకు ఠాగూర్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
కడ్తాల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 373/2026గా ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, ఐపీఎస్ పర్యవేక్షణలో, మహేశ్వరం జోన్ డీసీపీ కె. నారాయణ రెడ్డి,ఏసీపీ ఎస్. జానకిరెడ్డి తదితర అధికారుల మార్గదర్శ కత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీస్ శాఖ తెలిపింది.డ్రగ్స్ అక్రమ రవాణా లేదా వినియో గానికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియ జేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.









