కొల్లంపల్లిలో 552వ ఉర్సు ఉత్సవాలు ప్రారంభం..!
నారాయణపేట మండలం కొల్లంపల్లిలో కొలువైన హజ్రత్ సయ్యద్ షా అహ్మద్ ఖుతాల్ హుస్సేనీ అష్రఫీ జలాలీ దర్గా 552వ వార్షిక ఉర్సు ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి..

కొల్లంపల్లిలో 552వ ఉర్సు ఉత్సవాలు ప్రారంభం..!
అన్ని మతాల బోధనల సారాంశం మానవత్వం, ప్రేమ, శాంతి, సోదరభావమే.
(నారాయణపేట టౌన్ – రమాకాంత్)
నారాయణపేట మండలం కొల్లంపల్లిలో కొలువైన హజ్రత్ సయ్యద్ షా అహ్మద్ ఖుతాల్ హుస్సేనీ అష్రఫీ జలాలీ దర్గా 552వ వార్షిక ఉర్సు ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. అష్రఫియా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 26వ అఖిల భారత అంతర్మత సదస్సుతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
గోగి షరీఫ్ దర్గా సజ్జాదా నషీన్, సయ్యద్ షా కలీముల్లా హుస్సేనీ అధ్యక్షతన, కొల్లంపల్లి దర్గా సజ్జాదా నషీన్ మఖ్దూం ఖ్వాజా, సయ్యద్ షా జలాల్ హుస్సేనీ, అష్రఫీ జలాలీ పర్యవేక్షణలో సదస్సు నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా మౌలానా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు వకార్ ఇన్షా, ముజఫర్ హుస్సేన్ ఖాన్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్. రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.ఏ. రషీద్, బీసీ సంక్షేమ అధికారి మహమ్మద్ ఖలీల్, బీఆర్ఎస్ నాయకుడు సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వివిధ మతాలకు చెందిన ఆధ్యాత్మిక గురువులు, సామాజిక, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అన్ని మతాల బోధనల సారాంశం మానవత్వం, ప్రేమ, శాంతి, సోదరభావమేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ సమానమేనని, కులమతాలకు అతీతంగా పరస్పర గౌరవంతో జీవించాలని సూచించారు.
సూఫీ పీఠాలు ప్రేమ, ఐక్యత, మానవ సేవకు ప్రతీకలని, వాటి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి అంతర్మత సదస్సులు హిందూ, ముస్లింల ఐక్యతతోపాటు అన్ని మతాల మధ్య సౌహార్దాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో విద్య, వైద్యం, సామాజిక చైతన్యానికి ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు.
అనంతరం అష్రఫియా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వేసవిలో నిర్వహించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. దారుల్ ఉలూమ్ అష్రఫియా మదర్సా విద్యార్థులు ప్రదర్శించిన విద్యా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
అతిథులను దర్గా సజ్జాదా నషీన్ మౌలానా మఖ్దూం ఖ్వాజా సయ్యద్ షా జలాల్ హుస్సేనీ అష్రఫీ జలాలీ, డాక్టర్ మౌలానా సయ్యద్ అహ్మద్ హుస్సేనీ అష్రఫీ జలాలీ సత్కరించారు. అడ్వకేట్ అబ్దుల్ సలీం కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, సయ్యద్ ఫైజ్ పాషా కృతజ్ఞతలతో సదస్సు ముగిసింది.











