పెట్టుబడుల పేరుతో కోట్లలో టోపీ..!
యూనిక్ మెర్కంటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్వయం మల్టీస్టేట్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థల పెట్టుబడుల మోసం కేసులో ఐదుగురు నిందితులను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు.

పెట్టుబడుల పేరుతో కోట్లలో టోపీ..!
యూనిక్ కంపెనీ మోసం కేసులో ఐదుగురి పట్టివేత
కరీంనగర్ జిల్లాలో రూ.28 కోట్ల వరకు నష్టం
(కరీంనగర్ బ్యూరో – నరేష్, మనసాక్షి )
యూనిక్ మెర్కంటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్వయం మల్టీస్టేట్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థల పెట్టుబడుల మోసం కేసులో ఐదుగురు నిందితులను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 212/2026తో కేసు నమోదైంది. వివిధ పెట్టుబడి పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్, హోటల్ వెకేషన్ ప్యాకేజీల పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ప్రజల నుంచి డబ్బులు సేకరించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఏజెంట్లు, ప్రాంతీయ ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించిన వారు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. 2019లో పలు పథకాల గడువు ముగిసినా పెట్టుబడిదారులకు డబ్బులు తిరిగి చెల్లించలేదని, కోవిడ్ కారణంగా నష్టాలు వచ్చాయని పేర్కొంటూ 2020లో కంపెనీ కార్యకలాపాలు నిలిపివేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో కరీంనగర్ జిల్లాలో బాధితులకు సుమారు రూ.26 కోట్ల నుంచి రూ.28 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
Also Read : TG News : రైస్ మిల్లర్ల గుండెల్లో రైళ్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది అరెస్ట్..!
ఐదుగురు నిందితులు వీరే..
హైదరాబాద్‌కు చెందిన గుడిపాటి గాంధీ, మాకలసోంపల్లి కరియప్ప, ఉల్లిగడ్డల సంగప్ప, నిజామాబాద్‌కు చెందిన కొమిరె భూమా గౌడ్, పెద్దపల్లి జిల్లాకు చెందిన యేదెళ్ల రమేష్‌లను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కైలాష్ రాయ్‌ను ఆదిలాబాద్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన అక్కడి జైలులో ఉన్నారు.
బాధితులు ఫిర్యాదు చేయాలి
ఈ కేసులో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో లేదా సీసీఎస్ కరీంనగర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. బాధితుల సంఖ్య, నిధుల లావాదేవీలు, ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.









