District Collector : సైబర్ల్ నేరాలపై జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కీలక సూచన.. సైబర్ ముఠా అరెస్ట్..!
సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

District Collector : సైబర్ల్ నేరాలపై జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కీలక సూచన.. సైబర్ ముఠా అరెస్ట్..!
(మహబూబ్ నగర్ టౌన్ – శ్రీశైలం, మన సాక్షి)
సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టి జి ఎస్ బి మరియు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖ సమన్వయంతో, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు సైబర్ నేరాల నివారణ, సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ పాల్గొని సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత సమాచార భద్రత, ఆన్లైన్ మోసాల నివారణకు సంబంధించిన పలు సూచనలు చేశారు.
వ్యక్తిగత సమాచారం భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ, స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులు, సోషల్ మీడియా తదితర డిజిటల్ సేవల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
Also Read : District Collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీ..!
మొబైల్ యాప్‌లను ఉపయోగించే ముందు వాటి నిబంధనలు, అనుమతులను పరిశీలించాలని, ఆధార్, పాన్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, పాస్వర్డ్లు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింకులను తెరవడం, నమ్మకంలేని యాప్‌లను డౌన్లోడ్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.
ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, ఉన్నతాధికారుల పేరుతో ఫోన్ చేసి బెదిరించడం, డిజిటల్ అరెస్ట్ పేరుతో భయాందోళనలకు గురిచేయడం, తక్షణమే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడం వంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు తొందరపడి స్పందించకుండా, సంబంధిత అధికారులను సంప్రదించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని సూచించారు.
కార్యాలయాల్లోని అన్ని స్థాయుల సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సైబర్ నేరాల నివారణకు సహకరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, జిల్లా పోలీసు శాఖ సమన్వయంతో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి:
జిల్లా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను, భయాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సీఈఆర్పి ద్వారా సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా ఇలాంటి నేరాలను చాలా వరకు నివారించవచ్చని పేర్కొన్నారు.
సైబర్ మోసం జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయడం వల్ల మోసగాళ్ల ఖాతాల్లోకి బదిలీ అయిన డబ్బును నిలిపివేసే అవకాశం ఉంటుందని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం అందించాలని తెలిపారు.
మొబైల్ ఫోన్లు, బ్యాంకింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్వర్డ్లు ఏర్పాటు చేసుకోవాలని, వాటిని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. అపరిచితులు పంపే ఏపీకే ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయవద్దని హెచ్చరించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారుల ఫొటోలతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్స్ సృష్టించి డబ్బులు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డబ్బులు పంపే ముందు సంబంధిత వ్యక్తులను నేరుగా సంప్రదించి నిర్ధారించుకోవాలని తెలిపారు.
Also Read : నల్గొండ జిల్లాలో దారుణం.. విద్యుత్ కోతల కారణంగా ఎండిపోతున్న వరి పంటలు..!
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సైబర్ నేరాలపై అవగాహన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖ సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పి పి టి అవగాహన వీడియోల ద్వారా సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, సైబర్ నేరగాళ్లు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు అనే అంశాలను వివరించారు.
ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్‌లు, సోషల్ మీడియా మోసాలు, నకిలీ ప్రొఫైల్స్ తదితర సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఎవరికీ ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని వివరించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, మోసానికి గురైన వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు.
పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి పిల్లలు ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు తల్లిదండ్రులు తగిన పర్యవేక్షణ కలిగి ఉండాలని ఎస్పీ సూచించారు. సైబర్ వేధింపులు, ఆన్లైన్లో అపరిచితులతో పరిచయాలు, అనుచిత కంటెంట్ వంటి అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని కోరారు.
చిన్నారులకు సంబంధించిన లైంగిక దోపిడీ చిత్రాలు, వీడియోలను వీక్షించడం, భద్రపరచడం లేదా ఇతరులకు పంపడం తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. పిల్లల ఆన్లైన్ భద్రత విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
స్థానికంగా సైబర్ నేరాలకు పాల్పడిన ముఠా అరెస్టు
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎస్పీ, జిల్లాలోనూ సైబర్ నేరాలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఇటీవల తువ్వగడ్డ తండా ప్రాంతంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు, ఆన్లైన్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని ప్రజలకు సూచించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సైబర్ నేరాల నివారణ అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, జిల్లా రెవెన్యూ అధికారి నిర్మల, సైబర్ క్రైమ్ డీఎస్పీ గిరి కుమార్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.










