సుడా పీఠం ఎవరికి దక్కేను.?
కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించిన నేపథ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

సుడా పీఠం ఎవరికి దక్కేను.?
ఇద్దరు నరేందర్‌రెడ్డిల మధ్యే ప్రధాన పోటీ!
రేసులో పలువురు కాంగ్రెస్ నేతలు.. దీపావళిలోగా నియామకంపై ఆశలు
(కరీంనగర్ బ్యూరో – నరేష్ , మనసాక్షి )
కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించిన నేపథ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. దీపావళిలోగా పదవుల భర్తీ జరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ప్రధాన పోటీ ఇద్దరి మధ్యేనా?
సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మరోసారి అవకాశం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీకి చేసిన సేవలను ప్రస్తావిస్తూ తనకు రెండోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మద్దతు ఆయనకు కలిసివచ్చే అంశంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read : Karimnagar : 1.1 కిలోల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్, మరొకరు పరారు..!
మరోవైపు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందర్‌రెడ్డి సైతం సుడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వాలనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మద్దతు తనకు లభిస్తుందనే ఆశతో ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రేసులో మరికొందరు నేతలు
కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావుతో పాటు కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, రాచకొండ చక్రధర్ తదితరుల పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. సామాజిక సమీకరణాలు, పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ప్రాధాన్యం వంటి అంశాలు నియామకంలో కీలకంగా మారే అవకాశం ఉంది.
మంత్రుల మద్దతు ఎవరికో.. సీఎం నిర్ణయంపైనే ఆశలు!
సుడా చైర్మన్ ఎంపికలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ వర్గాల అభిప్రాయాలతో పాటు పార్టీ అధిష్ఠానం నిర్ణయం కీలకం కానుంది. గత చైర్మన్‌కే మరోసారి అవకాశం ఇస్తారా? లేక కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
దీపావళిలోగా నామినేటెడ్ పదవుల భర్తీ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో సుడా చైర్మన్ ఎంపికపై త్వరలో స్పష్టత వస్తుందనే ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
ఎవరికి దక్కనుంది సుడా పీఠం? కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి మరోసారి అవకాశం దక్కుతుందా? ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారా? లేక పార్టీ మరో నాయకుడి వైపు మొగ్గు చూపుతుందా? అనేది ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయంపై ఆధారపడి ఉంది.








