కరువును జయించిన రైతు..బీర సాగుతో రూ.2.40 లక్షల లాభం..!
నీటి ఎద్దడి.. వాతావరణ మార్పులు.. అనిశ్చిత వర్షాలు.. ఇవేవీ ఆ రైతును వెనక్కి తగ్గించలేకపోయాయి. సంప్రదాయ పంటలకు భిన్నంగా ఆలోచించి బీర సాగుతో మంచి లాభాలు సాధిస్తున్నాడు.

కరువును జయించిన రైతు..బీర సాగుతో రూ.2.40 లక్షల లాభం..!
సూర్యాపేట – ముత్యంరాజు, మనసాక్షి
నీటి ఎద్దడి.. వాతావరణ మార్పులు.. అనిశ్చిత వర్షాలు.. ఇవేవీ ఆ రైతును వెనక్కి తగ్గించలేకపోయాయి. సంప్రదాయ పంటలకు భిన్నంగా ఆలోచించి బీర సాగుతో మంచి లాభాలు సాధిస్తున్నాడు. ఆధునిక సాగు పద్ధతులను అందిపుచ్చుకుని తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి ఎక్స్ రోడ్డుకు చెందిన గుగులోత్ భాస్కర్.
భాస్కర్ తనకున్న 1.50 ఎకరాల్లో బీర పంట సాగు చేస్తున్నాడు. నీటి వృథాను అరికట్టేందుకు డ్రిప్ ఇరిగేషన్, నేలలో తేమను కాపాడేందుకు మల్చింగ్, తీగల పెరుగుదలకు ట్రెల్లిస్ విధానాన్ని అమలు చేస్తున్నాడు. ఈ పద్ధతులతో తక్కువ నీటితోనే పంటను సమర్థంగా సాగు చేస్తున్నాడు. కలుపు సమస్య తగ్గడంతో పాటు పంట నిర్వహణ, కాయల కోత కూడా సులువుగా మారింది.
20 టన్నుల దిగుబడి
ఆధునిక పద్ధతులతో సాగు చేసిన భాస్కర్ ఇప్పటివరకు 20 టన్నుల బీర దిగుబడి సాధించాడు. పంట విక్రయాల ద్వారా రూ.4 లక్షల ఆదాయం పొందగా, సాగుకు రూ.1.60 లక్షలు ఖర్చయ్యాయి. అన్ని ఖర్చులు పోను ఇప్పటివరకు రూ.2.40 లక్షల నికర లాభం వచ్చినట్లు తెలిపాడు. పంట దిగుబడి, మార్కెట్ పరిస్థితులను బట్టి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
వాహనంలో మార్కెట్‌కు :
పంట సాగుతోనే సరిపెట్టుకోకుండా మార్కెటింగ్‌లోనూ భాస్కర్ ప్రత్యేకత చాటుతున్నాడు. బీర కాయలను తన సొంత వాహనంలో వరంగల్ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తున్నాడు. దీంతో మధ్యవర్తులపై ఆధారపడకుండా పంటకు తగిన ధర పొందడంతో పాటు రవాణా ఖర్చులను కూడా తగ్గించుకుంటున్నాడు.
కూరగాయల సాగుతో నిత్యం ఆదాయం :
వరి సాగుతో పోలిస్తే కూరగాయల సాగు ద్వారా తరచూ ఆదాయం పొందే అవకాశం ఉంటుందని భాస్కర్ చెబుతున్నాడు. డ్రిప్, మల్చింగ్, ట్రెల్లిస్ పద్ధతులను పాటిస్తే నీటి కొరత ఉన్న పరిస్థితుల్లోనూ మంచి ఫలితాలు సాధించవచ్చని అంటున్నాడు. పంటల మార్పిడి, నీటి పొదుపు పద్ధతులను రైతులు అలవర్చుకోవాలని సూచిస్తున్నాడు.
ఉద్యాన శాఖ సూచన:
నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ పంటల వైవిధ్యీకరణ చేపట్టాలని సూర్యాపేట జిల్లా ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. బిందు సేద్యం, మల్చింగ్ వంటి ఆధునిక పద్ధతులతో సాగు ఖర్చులు తగ్గించుకుని, స్థిరమైన ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు.









