అఖిలభారత కిసాన్ సభ 36వ మహాసభలను జయప్రదం చేయాలి
నవంబర్ 15 నుంచి 18 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కేంద్రమైన నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని అఖిలభారత కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.

అఖిలభారత కిసాన్ సభ 36వ మహాసభలను జయప్రదం చేయాలి
అఖిలభారత కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
సూర్యాపేట, ముత్యంరాజు, మనసాక్షి
నవంబర్ 15 నుంచి 18 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కేంద్రమైన నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని అఖిలభారత కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
నవంబర్ 15న నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి రావాలని అన్నారు.దేశవ్యాప్తంగా 1.58 కోట్లకు పైగా సభ్యత్వంతో అఖిలభారత కిసాన్ సభ ప్రపంచంలోనే అతిపెద్ద రైతాంగ ఉద్యమ సంస్థగా కొనసాగుతోందని తెలిపారు. సామ్రాజ్యవాదం, భూస్వామ్యానికి వ్యతిరేకంగా సాగించిన చారిత్రాత్మక పోరాటాల వారసత్వాన్ని కొనసాగిస్తూ రైతాంగ హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందన్నారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెభాగా, వర్లీ ఆదివాసీ, పున్నప్ర-వయలార్, సుర్మా లోయ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను నిర్మిస్తోందని పేర్కొన్నారు. ఆ చారిత్రాత్మక పోరాటాల చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశవ్యాప్తంగా రైతులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం అఖిలభారత కిసాన్ సభ అనునిత్యం అండగా నిలుస్తోందని వివరించారు.
దేశానికి అన్నం పెట్టే రైతాంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే శ్రమజీవులు నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒకవైపు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా సాగుతున్న ఆర్థిక విధానాలు, మరోవైపు మతతత్వ రాజకీయాలు ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయిందని, వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమైందని పేర్కొన్నారు.
కార్పొరేట్ అనుకూల విధానాలు, అసమాన మార్కెట్ వ్యవస్థ, బలహీనమైన సామాజిక భద్రత, ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు సమగ్ర విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు, మహిళా రైతులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. మతం, కులం పేరుతో ప్రజలను విభజించే శక్తులకు బదులుగా జీవనోపాధి, భూమి, ఉపాధి, ఆహార భద్రత వంటి మౌలిక సమస్యలపై ప్రజలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం, గ్రామీణ పేదలకు ఉపాధి, భూమిలేని నిరుపేదలకు భూమి, సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.
నవంబర్ 15 నుంచి 18 వరకు జరిగే 36వ అఖిలభారత మహాసభలకు దేశం నలుమూలల నుంచి 850 మందికి పైగా ప్రతినిధులు, పరిశీలకులు, నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. నవంబర్ 15న లక్షలాది మంది రైతులతో భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరగనుందని పేర్కొన్నారు. నవంబర్ 14న నిర్వహించే రైతు ఎగ్జిబిషన్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించిన చారిత్రక పోరాటాలు, రైతాంగ ఉద్యమాలు, వ్యవసాయ పరిస్థితులను ప్రతిబింబించే అంశాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
Lmఈ మహాసభలు రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగ భవిష్యత్తు, రైతుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై దేశవ్యాప్త చర్చకు కీలక వేదికగా నిలవనున్నాయని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్నదాతను కాపాడటం అంటే దేశాన్ని కాపాడటమేనని, శ్రమజీవుల హక్కులను పరిరక్షించకుండా సమానత్వంతో కూడిన అభివృద్ధి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ములకలపల్లి రాములు,మట్టి పెళ్లి సైదులు, వృత్తి సంఘాల నాయకులు నాగారపు పాండు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.








