జాతీయ హాకీ జట్టు ప్రాబబుల్స్‌కు నల్గొండ యువకుడు.. తెలంగాణ నుండి ఏకైక క్రీడాకారుడిగా రావుల రికార్డు..!
నల్గొండ పట్టణానికి చెందిన యువ హాకీ క్రీడాకారుడు రావుల గణేష్ జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి సరికొత్త రికార్డు సృష్టించారు.

జాతీయ హాకీ జట్టు ప్రాబబుల్స్‌కు నల్గొండ యువకుడు.. తెలంగాణ నుండి ఏకైక క్రీడాకారుడిగా రావుల రికార్డు..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ పట్టణానికి చెందిన యువ హాకీ క్రీడాకారుడు రావుల గణేష్ జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి సరికొత్త రికార్డు సృష్టించారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఇటీవల జరిగిన జాతీయ హాకీ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన గణేష్, భారత హాకీ జట్టు ప్రాబబుల్స్ (ముందస్తు క్రీడాకారుల) 45 మంది జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఈ ప్రతిష్టాత్మక జాబితాకు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన ఏకైక హాకీ క్రీడాకారుడు గణేషే కావడం విశేషం.
నల్గొండ పట్టణంలోని పెద్దబండ కాలనీకి చెందిన రావుల యాదగిరి, ఉప్పలమ్మ దంపతుల కుమారుడైన రావుల గణేష్, చిన్నప్పటి నుంచే హాకీపై ఉన్న ఇష్టంతో కఠిన సాధన చేస్తూ ఈ స్థాయికి ఎదిగారు.
Also Read : PhonePe : ఫోన్ పే వినియోగదారులకు భారీ శుభవార్త.. సిఈఓ సంచలన ప్రకటన..!
జాతీయ పోటీల్లో సత్తా చాటి అంతర్జాతీయ స్థాయి ఎంపిక రేసులో నిలిచిన గణేష్‌ను తెలంగాణ హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండ విజయ్ కుమార్ హైదరాబాద్‌నందు జరిగిన ఒక కార్యక్రమంలో శాలువా కప్పి, ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో గణేష్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి, దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ అభినందన కార్యక్రమంలో నల్గొండ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కూతురు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి ఇమాన్ కరీం తదితరులు పాల్గొని గణేష్‌ను అభినందించారు. నల్లగొండ పట్టణం నుండి వచ్చి జాతీయ జట్టు రేసులో నిలిచిన రావుల గణేష్ సాధించిన విజయం పట్ల జిల్లా క్రీడాకారులు, స్థానికులు మరియు క్రీడా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









