Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

అర్ధరాత్రి పీడీఎస్ సన్న బియ్యం అక్రమ రవాణా.. వాహనాలు వదిలి కారులో పరారైన నిందితులు!

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేటలో  దొడ్డు బియ్యం కొనుగోలు మాటున సన్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో బియ్యం రవాణా వ్యవహారం మండలంలో కలకలం రేపింది.

అర్ధరాత్రి పీడీఎస్ సన్న బియ్యం అక్రమ రవాణా.. వాహనాలు వదిలి కారులో పరారైన నిందితులు!

(మహబూబ్ నగర్ జిల్లా, గోపాల్, మనసాక్షి)

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేటలో
దొడ్డు బియ్యం కొనుగోలు మాటున సన్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో బియ్యం రవాణా వ్యవహారం మండలంలో కలకలం రేపింది. ఆదివారం రాత్రి మండలంలోని లింగంపల్లి, అమ్మాపూర్ గ్రామాల మధ్య రెండు టాటా ఏసి వాహనాల్లో రేషన్ బియ్యాన్ని తరలించి, అక్కడ సిద్ధంగా ఉంచిన ఓ కంటైనర్‌లోకి ఎక్కిస్తున్న క్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్తులు గుర్తించి అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని బియ్యాన్ని పరిశీలించారు.

జహీరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ ద్వారా దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా తెలిసింది. అయితే ఆ బియ్యంతో పాటు సన్న బియ్యం బస్తాలు కూడా ఉండటంతో అసలు వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొడ్డు బియ్యం తరలింపు మాటున సన్న బియ్యాన్ని కూడా అక్రమంగా తరలిస్తున్నారా? అనే సందేహాలు తలెత్తాయి.

సన్న, దొడ్డు బియ్యం కలిపి సుమారు 150కి పైగా బస్తాలు ఉన్నట్లు సమాచారం. దీంతో బియ్యం తరలింపునకు ఉపయోగించిన రెండు టాటా ఏసి వాహనాలతో పాటు కంటైనర్‌ను పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించారు.

టెండర్ ద్వారా కాంట్రాక్టర్ దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించినప్పటికీ, అందులో సన్న బియ్యం బస్తాలు ఉండటంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారానికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులు అక్కడి నుంచి కారులో పరారైనట్లు స్థానికులు తెలిపారు.

అసలు బియ్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏ రేషన్ దుకాణాల నుంచి తరలించారు? టెండర్ ద్వారా కొనుగోలు చేసిన బియ్యంలో సన్న బియ్యం ఎలా చేరాయి? ఈ రవాణా వెనుక ఎవరున్నారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు