సిఎం రేవంత్ రెడ్డి కీలక సూచన.. ఇక 12వ తరగతి విధానం.. తెలంగాణలో విద్యా సంస్కరణలు..!
విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు నాణ్యమైన విద్యా బోధన ద్వారా, ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.

సిఎం రేవంత్ రెడ్డి కీలక సూచన.. ఇక 12వ తరగతి విధానం.. తెలంగాణలో విద్యా సంస్కరణలు..!
హైదరాబాద్, మన సాక్షి :
విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు నాణ్యమైన విద్యా బోధన ద్వారా, ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. విద్యా శాఖపై ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచి 12వ తరగతి వరకు విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
12వ తరగతి వరకు విద్యార్థులను భాషా, సమాచార నైపుణ్యాలపై పూర్తి పట్టు సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. 12వ తరగతి తర్వాత తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకొని అందులో నిపుణులుగా మారేందుకు విద్యార్థులకు అవకాశం ఉండాలన్నారు. 10వ తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని, అందులో అత్యధికులు బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలే ఉంటున్నారని అన్నారు. 12వ తరగతి వరకు కొనసాగింపు ఉన్న కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో డ్రాపౌట్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంటోందన్నారు.
దేశంలో 18 రాష్ట్రాల్లో 12వ తరగతి వరకు విధానమే అమలు చేస్తున్నారని, విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలల్లోని లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, రిటైర్‌మెంట్ బెనిఫిట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని, అవసరమైన భవనాలను పూర్తి వసతులతో నిర్మించడానికి కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాటి కోసం అవసరమైన నిధులు విడుదల చేస్తామన్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (YIIRS) నిర్మాణ పురోగతిపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమీక్షించారు. YIIRS నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశిత సమయంలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో నిర్మిస్తున్న స్కూళ్ల నిర్మాణ ప్రగతిపైనా సమీక్షించారు. ఆయా స్కూళ్ల నిర్మాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటే వెంటనే ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసిన తర్వాత విద్యార్థుల నమోదు పెరగడంతో పాటు వాటిలో శిక్షణ పొందిన వారందరికీ ఉద్యోగాలు లభించాయని తెలిపారు. పాలిటెక్నిక్‌ల అప్‌డేట్‌కు అవసరమైన నిధుల విడుదలను వేగవంతం చేయాలని ఆదేశించారు. యూనివర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ఇతర ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, పి.సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొలుగరం కుమార్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.









