క్లస్టర్ కేంద్రాల ఎంపిక నిష్పక్షపాతంగా జరగాలి.. జిల్లా రెవిన్యూ అధికారికి నిసార్ అహ్మద్ వినతి
అన్నమయ్య జిల్లా త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటు చేస్తున్న క్లస్టర్ కేంద్రాల ఎంపికలో రాజకీయ పక్షపాతానికి తావులేకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ ఎస్. నిసార్ అహ్మద్ శుక్రవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవిన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

క్లస్టర్ కేంద్రాల ఎంపిక నిష్పక్షపాతంగా జరగాలి.. జిల్లా రెవిన్యూ అధికారికి నిసార్ అహ్మద్ వినతి
(మదనపల్లి, మనసాక్షి – రాజు)
అన్నమయ్య జిల్లా త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటు చేస్తున్న క్లస్టర్ కేంద్రాల ఎంపికలో రాజకీయ పక్షపాతానికి తావులేకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ ఎస్. నిసార్ అహ్మద్ శుక్రవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవిన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, గతంలో అనుసరించిన విధానానికి భిన్నంగా కొన్ని మండల కార్యాలయాల్లో లేదా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విధమైన ఎంపికలో రాజకీయ ప్రభావాలు, పక్షపాత ధోరణులకు అవకాశం కలిగితే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : ఏపీ ప్రభుత్వంతో రూ.2,500 కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్న ఎస్.ఎల్.ఎన్.కాఫీ..
ప్రజాస్వామ్య ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించడం ఎన్నికల యంత్రాంగం బాధ్యత అని పేర్కొన్నారు. క్లస్టర్ కేంద్రాలను రాజకీయ ప్రభావాలకు అతీతంగా ఎంపిక చేయాలని, ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులందరికీ ఎలాంటి ఆటంకాలు, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునే స్వేచ్ఛ కల్పించాలని, నామినేషన్ల స్వీకరణ బాధ్యతలు నిర్వహించే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.
ఈ అంశాలపై తక్షణమే సమీక్షించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు నాయకులు తెలిపారు. ఈ వినతి పత్రం ప్రతులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా అధికారులకు కూడా పంపించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మొహమ్మద్ యూనస్, యాసిన్, మాలేపాడు చలపతి, అబ్దుల్లా, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.









