అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం.. అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన..!
నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని ధర్వేశిపురం(పర్వతగిరి) రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం.. అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన..!
కనగల్ , మనసాక్షి:
నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని ధర్వేశిపురం(పర్వతగిరి) రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయం వద్ద రూ. 15 కోట్ల పర్యాటక నిధులతో నిర్మించనున్న విశ్రాంతి గృహం, హరిత హోటల్, దేవాలయ సుందరీకరణ, పనులకు శంకుస్థాపన చేశారు.
అలాగే నల్గొండ బైపాస్ నుండి సాగర్ రోడ్డు వయా మంచినీళ్లబావి ధర్వేశిపురం, చర్లగౌరారం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర రూ.37 కోట్ల వ్యయంతో అభివృద్ధిపరిచే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కనగల్ బ్రిడ్జి నుంచి మైల సముద్రం చెరువు తేలకంటిగూడెం మీదుగా 5 కిలోమీటర్ల మేర రూ.21 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కనగల్ మండల కేంద్రంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి త్వరలోనే మరో రూ. 25 కోట్ల మంజూరు చేయించనున్నట్లు వెల్లడించారు. ఇదివరకే దర్వేశిపురం రోడ్డు వెడల్పు చేయడం, డివైడర్ సెంట్రల్ లైటింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రూ. 67 కోట్లతో దేవాలయ రోడ్డుతో పాటు, గ్రామంలో రహదారులు ఇతర పనులు చేపట్టామని వెల్లడించారు. నల్గొండ నుండి ధర్వేశిపురం వరకు రూ. 50 కోట్లతో రోడ్డు పనులు చేపట్టామని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు వంటివి అందిస్తున్నదని, రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతున్నదని, గురువారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంధీరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుందని, ఇటీవలే ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని, ఈ పథకంలో అందరు నమోదు చేసుకోవాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలోజిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి, కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, సర్పంచ్ రాయల శేఖర్, నర్సింగ్ మురళీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గణేష్, తదితరులు పాల్గొన్నారు.
BY : SAIDULU, KANAGAL










