Breaking News : పిల్లలను సంపులో పడేసిన తల్లి, 70 తులాల బంగారం చోరీ.. ఒకే క్లిక్ తో ఎన్నో బ్రేకింగ్ న్యూస్..!
మన సాక్షి వెబ్ సైట్ లో స్థానిక నుంచి జాతీయం, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఈరోజు శనివారం (28-11-2026) బ్రేకింగ్ న్యూస్ మీకోసం

Breaking News : పిల్లలను సంపులో పడేసిన తల్లి, 70 తులాల బంగారం చోరీ.. ఒకే క్లిక్ తో ఎన్నో బ్రేకింగ్ న్యూస్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
మన సాక్షి వెబ్ సైట్ లో స్థానిక నుంచి జాతీయం, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఈరోజు శనివారం (28-11-2026) బ్రేకింగ్ న్యూస్ మీకోసం
40 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. 9వ ప్రయత్నంలో సర్పంచ్‌గా విజయం!
ప్రజాసేవ చేయాలనే సంకల్పం ఉంటే ఓటములు కూడా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని నిరూపించారు కడప జిల్లాకు చెందిన వెంకటయ్య. సర్పంచ్ కావాలనే ఆశయంతో ఏకంగా 40 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. వరుసగా 8 సార్లు నిరాశ ఎదురైనా వెనక్కి తగ్గలేదు. చివరకు ఈసారి గ్రామస్థుల మద్దతుతో విజయం సాధించి తన కలను నిజం చేసుకున్నారు. ఆయన పట్టుదలకు గ్రామస్థులు ఇచ్చిన గౌరవం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మియాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య :
మియాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని సింధూజ అలియాస్ తుషారిక (36) ఆత్మహత్య కు పాల్పడింది. జగిత్యాల జిల్లాకు చెందిన ఆమె పదేళ్ల క్రితం విడాకుల అనంతరం ఒంటరిగా జీవిస్తున్నారు. గత నాలుగు నెలలుగా తీవ్రమైన ఒంటరితనం, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని సూసైడ్ నోట్లో రాసినట్లు సమాచారం.
స్నేహితుడు ఫోన్ చేసినా స్పందించక పోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్తతో గొడవ.. కన్న పిల్లలను సంపులో పడేసి, తానూ దూకిన తల్లి :
భర్తతో గొడవ పడి కన్న పిల్లలను సంపులో పడేసి, తల్లి కూడా దూకింది. ముగ్గురు ఆడపిల్లలు మృతి చెందగా..తల్లి ప్రాణాలతో బయటపడింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భర్తతో గొడవ కారణంగా మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ముగ్గురు కుమార్తెలను ఇంట్లోని నీటి సంపులో పడేసి, తానూ అందులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్‌లో 70 తులాల బంగారం చోరీ
70 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆసిఫ్‌నగర్ జేబా బాగ్ డి-క్లాస్‌లో ఉంటున్న మహమ్మద్ వాసిం కుటుంబ సభ్యులు నిన్న సాయంత్రం బయటకు వెళ్లారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కార్తిక దీపం అంటుకుని యువతి మృతి
హైదరాబాద్ కేపీహెచ్‌బీ పరిధి అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌కు చెందిన 18 ఏళ్ల సాయి వెంకట సింధు (బొటిక్ నిర్వాహకురాలు) కార్తిక దీపం అంటుకుని మృతి చెందారు. ఈ నెల 12న రాత్రి షాప్ నుంచి ఇంటికి వస్తుండగా గేటు వద్ద దీపం చీరకు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
కాకతీయ స్కూల్స్ ఎదుట టీచర్స్ ధర్నా :
హైదరాబాద్ లోని హయత్‌నగర్ కాకతీయ స్కూల్స్ ఎదుట టీచర్స్ ధర్నా చేశారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ ఉపాధ్యాయుల ఆందోళన చేశారు. సర్టిఫికెట్స్ అడిగిన నలుగురు టీచర్లను నిర్బంధించారని ఆరోపణ చేస్తున్నారు. దీనిపై విద్యాశాఖాధికారులు విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
లొంగిపోయిన మావోయిస్టులకు చెక్కులు పంపిణీ :
లొంగిపోయిన మావోయిస్టులకు చెక్కులు అందజేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. 18 మంది మావోయిస్టులకు రూ.75 లక్షలు విలువ చేసే చెక్కులు అందజేత.. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కమలేష్ సహా 18 మంది మావోయిస్టులకు చెక్కుల పంపిణీ చేశారు.
బీజేపీ ఎంపీలకు అధిష్టానం ఆదేశాలు :
రేపు ఢిల్లీలోనే ఉండాలని బీజేపీ ఎంపీలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో విప్ల సమావేశం జరగనున్న నేపథ్యంలో ఎంపీలంతా అందుబాటులో ఉండాలని సూచించింది.











