స్నేహితుడి కుటుంబానికి అండగా

ఉదారతను చాటిన స్నేహబంధం

తుంగతుర్తి , అక్టోబర్ 23 , మన సాక్షి : వారంతా చిన్ననాటి స్నేహితులు.. కలిసిమెలిసి ఆటలాడుకుంటూ చదువుకున్నారు. పెరిగి పెద్దయి ఎవరికి వారు జీవితాలలో స్ధిరపడ్డారు. ఇంతలో తమతో చదివిన చిన్ననాటి మిత్రుడు అనారోగ్యంతో అకాల మృతి చెందాడన్న విషయం తెలిసి చలించిపోయారు. ఎలాగైనా స్నేహితుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించుకోని బృందంగా ఏర్పడి చేయి చేయి కలిపి చేతనైనంత సాయాన్ని చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నగదును సేకరించిన మొత్తాన్ని మిత్రుడి భార్యకు అందజేశారు.

వివరాల్లోకి వెళ్తే… మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన చర్లపల్లి ముత్యాలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.1997-98 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన బాల్యమిత్రులంతా కలిసి మృతుని ఆర్థిక పరిస్థితి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి సాయం చేయాలనే సంకల్పంతో రూ.25 వేలును సేకరించారు. ఆ నగదుతో పాటు క్వింటా బియ్యాన్ని ఆదివారం స్నేహితుని భార్యకు అందజేశారు.

ఇందులో బాల్య మిత్రుల బృందం సభ్యులు పులుగుజ్జ యాకయ్య, గుండా శ్రీనివాస్, కటికిరెడ్డి సుధీర్ కుమార్, చేపూరి శ్రీనివాస్, చిర్ర దామోదర్, అనిల్ కుమార్, తేజ నాయక్, ఎల్లయ్య, జక్కుల కొమరయ్య, జక్కుల మల్లయ్య, బొమ్మరబోయిన కొమరయ్య ఇతర స్నేహితులు ఉన్నారు.మానవతా దృక్పథంతో మిత్రునికి అండగా నిలిచి సాయాన్ని అందజేసిన స్నేహితులను గ్రామస్థులు అభినందించారు. ముందు తరం వారికి మీ స్నేహబంధం ఆర్థిక సహాయం స్ఫూర్తిగా నిలుస్తుందని గ్రామస్తులు అన్నారు. అదేవిధంగా ముత్యాలు కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందజేసిన స్నేహితులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.