నోటి కాడి ముద్ద జారిపోయింది..! – రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు
నోటి కాడి ముద్ద జారిపోయింది..! – రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు
దుబ్బాక, మనసాక్షి :
నోటికాడి బుక్క జారిపడినట్టు వడగళ్ల వర్షానికి పంట నేల రాలడం దురదృష్టకరమని, రైతులు అధర్య పడద్దని ధైర్యంగా ఉండాలని, అండగా కేసీఆర్ ప్రభుత్వం ఉందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం దుబ్బాక మండలంలో పంట పొలాలను చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని చెప్పారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లోని రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి నేల రాలిన వరి పంటలను పరిశీలించారు. వడగళ్ల వానతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రైతులెవ్వరూ అధైర్యపడద్దని మంత్రి చెప్పారు. వడగళ్ల వానతో జిల్లా లో తీవ్ర నష్టం జరుగిందని… అందులో దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. పంటలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి తనను పంపినాడని చెప్పారు. ప్రతి ఎకరాకు పది వేలు నష్టపరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వాలు రైతులకు ఎప్పుడు సహాయం చేసిన పాపాన పోలేదని విమర్శించారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు దేశాన్ని ఆకర్శింపజేస్తున్నాయని హరీష్ రావు అన్నారు. వడగళ్ల తో నష్టపోయిన రైతులు ఆత్మస్తైర్యం కోల్పోవద్దని.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రోజుకో మంత్రి వచ్చి తెలంగాణ లో మత ఘర్షణలు లేపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి నాయకులకు రైతుల మీద ప్రేమ ఉంటే ఢిల్లీ నుంచి పది వేల రూపాయలు తేవాలని.. ఇద్దరం కలిపి రైతులకు ఇరవై వేలు రైతులకు ఇద్దాయమన్నారు. గతంలో తెలంగాణ కు పైస ఇవ్వని పార్టీ కాంగ్రెస్ వారు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటు అన్నారు. కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రంలో ఎకరాకు పదివేలు ఇచ్చినట్టు చూపించండని ఎద్దేవా చేశారు. పని చేసే ప్రభుత్వం పై నిందలు వేస్తే ప్రజలు సహించేది లేదని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుమంటే ఓ మంత్రి నూకలు బుక్కుమనడం బాధాకరం కాదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని బిజెపి నాయకులు చెప్పుకోండి చూద్దామని అన్నారు. బావిల కాడ మీటర్లు పెట్టడం నిజం కాకుంటే తెలంగాణ కు రావాల్సిన ౩౦వేల కోట్లు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.
కేంద్రం చేసే పనులన్నీ రైతు వ్యతిరేక పనులే అంటూ విమర్శించారు. వేల కోట్లు పెట్టి రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చింది బిఆర్ఎస్ ఘనత కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ లో 57 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది నిజం కాదా అన్నారు. రైతుల విషయంలో ఎప్పుడు వెనకకు పోని నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. నగదు బదిలికి రోల్ మాడల్ తెలంగాణ అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన చెప్పారు.
అన్నదాత ఆస్తులు పెంచేది బిఆర్ఎస్ అయితే.. అదాని ఆస్తులు పెంచేది బిజెపి అని విమర్శించారు. మొన్న గ్రామ పంచాయతీ లలో దేశంలో అతిఎక్కువ అవార్డులు సాధించిన ఘనత తెలంగాణదే అన్నారు. అబద్ధాల ప్రచారం తో బిజెపి ముందుకు రావాలని చూస్తుందని వాటిని ప్రజలు నమ్మరని చెప్పారు. ఎన్నికల కోసం దుబ్బాక ప్రజలు ఎదురు చూస్తున్నారని.. గులాబీ జెండా ఎగురవేసేందుకు ఉత్సాహంతో ఉన్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో దుబ్బాక లో నూరు శాతం గులాబీ జెండా ఎగరుతుంది.. అందులో ఎలాంటి అనుమానం లేదని మంత్రి హరీష్ రావు చెప్పారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కడ్తల రవీందర్ రెడ్డి, ఎంపీపీకొత్త పుష్పలత కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ బాల్రెడ్డి, పార్టీ హార్డ్ వర్కర్ పండు తో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు









