సూర్యాపేట : మంత్రి జగదీశ్ రెడ్డి పై సంకినేని సంచలన ఆరోపణ
సూర్యాపేట : మంత్రి జగదీశ్ రెడ్డి పై సంకినేని సంచలన ఆరోపణ
సూర్యాపేట , మనసాక్షి
అకాల వర్షాలు కురుస్తున్నా వడ్ల కొనుగోలు లో ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బి జేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు వచ్చేంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని
రైతులకు అండగా ఉండాల్సిన మంత్రినే మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం కొనుగోలు ఆలస్యం చేస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. ఐకెపి కేంద్రాల్లో వడ్లు కొనుగోలు చేయకపోవడంతో మిల్లర్లకు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.
రైతు బంధు పథకం పేరు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిలువునా దోపిడీ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాలు వచ్చేంతవరకు కూడా ధాన్యం కొనుగోలు జరపడం లేదని అన్నారు. గతంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాకుండానే ట్రక్ షీట్లు కొనుగోలు పత్రాలు సృష్టించి బిఆర్ఎస్ నాయకులు అక్రమ దందాకు పాల్పడ్డారని ఆరోపించారు.
సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లలో 1100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని దీనికి పాత్రధారి, సూత్రధారి మంత్రి జగదీశ్వర్ రెడ్డిఅని విమర్శించారు. రైతులను మిల్లర్లు దోచుకుంటే కాపాడాల్సిన పాలకులే దోపిడీదారులకు అండగా ఉంటున్నారని అన్నారు.
ధాన్యం ఎఫ్ సి ఐ కి పెట్టని మిల్లులను అధికారులు బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా , రీ అలాట్మెంట్ చేస్తున్నారంటే పాలకులకు, మిల్లర్లకు మధ్య ఏ స్థాయిలో ఒప్పందం జరిగిందో అర్థం చేసుకోవచ్చుఅన్నారు. మొలకలు వచ్చిన , రంగు మారిన ధాన్యాన్ని కూడా ఎమ్మెస్పీ ధరకే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను నష్టపోకుండా చూడాలని డిమాండ్ చేశారు.
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు 20000, మామిడి తోట ద్వారా నష్టపోయిన వారికి 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు సలిగంటి వీరేంద్ర, మల్లెపాక సాయిబాబా, పార్లమెంట్ కో కన్వీనర్ తుక్కని మన్మధ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, జిల్లా అధికార ప్రతినిధి పలస మల్సూర్ గౌడ్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వల్దాసు ఉపేందర్,
మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మీరు అక్బర్, పట్టణ ప్రధాన కార్యదర్శులు అరూరి శివ, తోనూకునూరి సంతోష్ కుమార్ , జిల్లా నాయకులు జల్లి గణేష్ , దాసరి వెంకన్న యాదవ్, యువ మోర్చా మండల నాయకులు బీమగాని గణేష్ తదితరులు పాల్గొన్నారు.









