Miryalaguda : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. గోల్డెన్ అవర్ లో సహాయపడిన వారికి రహవీర్ పథకం ద్వారా నగదు బహుమతులు..!
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’ అని పిలుస్తారని, ఈ సమయంలో బాధితులకు తక్షణ వైద్యసేవలు అందితే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించడం ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.

Miryalaguda : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. గోల్డెన్ అవర్ లో సహాయపడిన వారికి రహవీర్ పథకం ద్వారా నగదు బహుమతులు..!
మిర్యాలగూడ, మనసాక్షి :
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఏఆర్సి ఫంక్షన్ హాల్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. గత ఏడాది జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 350 మంది మృతి చెందగా, వారిలో 90 శాతం మంది హెల్మెట్ ధరించని వారేనని తెలిపారు. అవగాహన కార్యక్రమాల అనంతరం హెల్మెట్ లేనివారిపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గత ఏడాది మిర్యాలగూడ డివిజన్‌లో 93 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
అలాగే ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే తక్షణమే 100 లేదా 108 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’ అని పిలుస్తారని, ఈ సమయంలో బాధితులకు తక్షణ వైద్యసేవలు అందితే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.
రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి రహవీర్ పథకం ద్వారా మొదటిసారి రూ.25,000, రెండోసారి రూ.50,000, మూడోసారి రూ.1 లక్ష వరకు పరిహారం అందిస్తారని తెలిపారు. ఇటీవల జిల్లాలో వెంకన్నకు రూ.25 వేల పరిహారం అందిన విషయాన్ని కూడా వెల్లడించారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలిస్తే పోలీసులతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతున్నందున ట్రాఫిక్ సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు సహాయం అందించడంలో పోలీస్ కేసులు అవుతాయని భయపడుతున్న ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని సూచించారు. మిర్యాలగూడ పట్టణంలోని హైవేల వెంట ఉన్న మద్యం దుకాణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నందున వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే మిర్యాలగూడలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. హెల్మెట్ లేనివారికి జరిమానాలు విధించడం కంటే, హెల్మెట్ కొనుక్కొని వస్తేనే వాహనం ఇవ్వాలని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అవసరమని అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రమాదంలో గాయపడిన వారికి ఇవ్వవలసిన ప్రథమ చికిత్స విధానాలను ప్రదర్శన ద్వారా చూపించి ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం రోడ్డు భద్రతా నిబంధనలు పాటించే విధంగా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, వన్ టౌన్ సీఐ నాగభూషన్, టూ టౌన్ సీఐ సోమనరసయ్య, రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరు సుధాబాలకృష్ణ, ఆర్టీవో, ఆర్టీసీ డీఎం, వైద్యాధికారులు, డ్రైవర్లు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.











