మునుగోడు ఉపఎన్నికల లెక్కింపు ఇలా.. Latest news

మునుగోడు ఉపఎన్నికల లెక్కింపు ఇలా..

ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం

15 రౌండ్ల లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి

మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఫలితాలు విడుదల అయ్యే అవకాశం…

మొదట చౌటుప్పల్ మండలంలోని ఓట్ల లెక్కింపు…

చౌటుప్పల్, నవంబర్ 5, మనసాక్షి : తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. దేశం మొత్తం కూడా మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు ఎలా ఉంటుందోననీ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా 93.41 శాతంగా పోలింగ్ నమోదయి మునుగోడు ఉప ఎన్నిక చరిత్ర సృష్టించింది. మొత్తం 2,41, 855 మంది ఓటర్లు గాను, 686 పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు కలుపుకొని 2,25,878 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతంగా నిలిచింది. మునుగోడులో 2014లో జరిగిన ఎన్నికల్లో 82.14 శాతం, 2018 లో జరిగిన ఎన్నికల్లో 91.30శాతం వచ్చింది. నవంబర్ 3న జరిగిన ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో 93.41 శాతముగా నమోదయి గత రీకార్డులను తిరగరాసింది. అంతకుముందు జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో 84.75 శాతం, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో 88 శాతం తో, 2 ఎమ్మెల్యే స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తర్వాత హుజురాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో 87 శాతం. దుబ్బాక లో జరిగిన ఉప ఎన్నికల్లో 82.61 శాతం తో,2 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ
కైవసం చేసుకుంది దీంతో అందరి దృష్టి ఈరోజు విడుదలయ్యే మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఇరుపాటి వర్గాలు ఎవరికి వారు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అత్యధిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికార టీఆర్ఎస్ కు గెలుపు అనుకూలంగా ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే.మునుగోడు ఫలితం గురించి సర్వే సంస్థల నివేదికలు ప్రజా భిన్నాభిప్రాయాలు ఎలా ఉన్నా అసలు ఓటరు తీర్పు ఎలా ఉండేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. మునుగోడు నియోజకవర్గం లో మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది.
మునుగోడు ఉప ఎన్నికల్లో
మండలాల వారిగా నమోదైన పోలింగ్ శాతం..
చౌటుప్పల్,93.68శాతం.
నారాయణపురం,93.76 శాతం.
చండూరు,93,51శాతం.
గట్టుప్పల్,92.61 శాతం.
మర్రిగూడ,91,41 శాతం.
మునుగోడు,93.50శాతం.
నాంపల్లి,92,37 శాతం. నమోదైంది.

నల్గొండ పట్టణంలోని అర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ లో కౌంటింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం8 గంటలకు ప్రారంభం కానుంది.

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుల్లో మొదట చౌటుప్పల్ ,తర్వాత నారాయణపురం, మునుగోడు,చండూరు, మర్రిగూడెం ,నాంపల్లి, గట్టుప్పల్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తారని సమాచారం…. మొదట 686 పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు చేసిన తర్వాత ఈవీఎం లలోని నమోదైన ఓట్లు లెక్కించి మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. ఓటింగ్ కోసం మొత్తం 21 టేబుల్స్ అధికారులు ఏర్పాటు చేశారు,ఒక్కొక్క రౌండ్ లో 21 పోలింగ్ స్టేషన్లో నమోదైన ఓట్లను లెక్కించిన తర్వాత అధికారికంగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు ఆది వారం మధ్యాహ్నం ఒంటిగంటలోపు పూర్తిస్థాయి ఫలితాలు రావచ్చని తెలుస్తుంది.