Latest news : ప్రాణం తీసిన రైస్ పుల్లింగ్..!

నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో గత నెల 19 న వెలుగు చూసిన వ్యక్తి అనుమానాస్పద మృతి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.

Latest news : ప్రాణం తీసిన రైస్ పుల్లింగ్..!

కనగల్, మన సాక్షి:

నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో గత నెల 19 న వెలుగు చూసిన వ్యక్తి అనుమానాస్పద మృతి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎస్పీ చందనా దీప్తి హత్య కేసు వివరాలను వెల్లడించారు. యాదాద్రి జిల్లా లోని యాదగిరిగుట్టకు చెందిన సముద్రాల కృష్ణ (50) రియల్ ఎస్టేట్ వ్యాపారం తో పాటు రైస్ పుల్లింగ్ పేరుతో ఇతరులను బురిడీ కొట్టిస్తూ రైస్ పుల్లర్ ను ఇస్తానంటూ మోసాలకు పాల్పడుతుండేవాడు.

ఈ క్రమంలో నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగబండి మధు నుంచి రైస్ పుల్లర్ ఇస్తానని రూ. కోటి 50 లక్షలను సముద్రాల కృష్ణ తీసుకున్నాడు. రైస్ పుల్లర్ ఇవ్వాలని పలుమార్లు అడుగగా బెంగళూరు నుంచి తేవాలని నమ్మబల్కుతూ కాలయాపన చేశాడు. (రైస్ పుల్లర్ అంటే అరుదైన ఇరిడియం లోహంతో కూడిన వస్తువు ఇది బియ్యాన్ని ఆకర్షిస్తుంది).

తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో హార్దిక ఇబ్బందులు ఎక్కువైనందున కృష్ణను హతమార్చి అతని వద్ద ఉన్న బంగారం, నగదు ఇతర ఆస్తులను తీసుకోవాలనే పన్నాగంతో హత్యకు పతక రచన చేశాడు. ఏపీలోని గుంటూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మ శ్రీనివాసరావు, ఏపీ రాష్ట్రంలోని కాకినాడకు చెందిన యల్లా కృష్ణ చైతన్య, కాకినాడకు చెందిన సలాది మణికంఠ, కాకినాడకు చెందిన అడపా హరి కిరణ్, గుంటూరు కు చెందిన ఎండి ఉస్మాన్ లతో కలిసి నాగబండి మధు కృష్ణను హత్య చేశారు.

కాకినాడలో ఎర్టిగా కారు కిరాయికి తీసుకుని ఓఎల్ఎక్స్ లో విక్రయానికి పెట్టిన కారు నెంబర్ను ఎర్టిగా కారుకు తగిలించారు. తెనాలిలో సైనేడ్ కొనుగోలు చేసి తీసుకున్నారు. గత నెల 9న అందరూ కలిసి యాదగిరిగుట్టలోని సముద్రాల కృష్ణ ఇంటికి వెళ్లారు. నర్సరీ వ్యాపారం చేస్తున్నారని ప్లాటు కొంటారని తన వెంట వచ్చిన వారిని నాగవండి మధు, కృష్ణకు పరిచయం చేశాడు. అదే రోజు చంపాలనుకున్నారు కానీ వీలు కాలేదు.

రెండోసారి గత నెల 16వ తేదీన ఇంట్లో కృష్ణ ఒంటరిగా ఉండడాన్ని గమనించి సముద్రాల కృష్ణ పై దాడి చేసి గొంతు నులిపి నోటిలో సైనైడ్ పోసి చంపేశారు. కృష్ణ మరణించాడు అని నిర్ధారించుకున్న తర్వాత మృతుని వద్ద ఉన్న ఏడున్నర తులాల బంగారం, అరకిల వెండి ఆభరణాలతో వెంట తెచ్చుకున్న ఎర్టిగా కారుతోపాటు మృతుని బ్రీజా కారును తీసుకొని కారులో సముద్రాల కృష్ణ మృతదేహాన్ని వేసుకొని కనగల్ బ్రిడ్జి పైనుంచి కింద పడేసి వెళ్లిపోయారు.

గుంటూరు కు చెందిన గోల్డ్ వ్యాపారి షేక్ భాషాకు వెండి బంగారం విక్రయించి అందరూ సమంగా డబ్బులు పంచుకున్నారు. గత నెల 19న కనగల్ పోలీసులు కృష్ణది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా హత్యోదంతం బయటపడింది. కృష్ణకు పెళ్లి కాలేదు. తల్లిదండ్రులు చనిపోయారు. భార్యా పిల్లలు లేరు. అయినా డబ్బు సంపాదనలు ఇతరులను మోసం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

ఏ1 నాగబండి మధు, ఏ2 కమ్మ శ్రీనివాస్, ఏ3 యాల్లా కృష్ణ చైతన్య, ఏ4 సలాది మణికంఠ, ఏ5 అడపా హరి కిరణ్, ఏ6 ఎండి ఉస్మాన్ ఆరుగురు నిందితులతో పాటు గోల్డ్ వ్యాపారి ఏ7 ఎస్ కే భాషను మర్రిగూడ బైపాస్ వద్ద శనివారం పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. కేసును చేదించిన ఎస్ డి పి ఓ శివరామరెడ్డి, చండూరు సిఐ వెంకటయ్య, కనగల్ ఎస్సై రామకృష్ణ, సిబ్బంది రమేష్, ప్రభాకర్, స్వర్ణ నాయక్, సురేష్, రమేష్, రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డిలను ఎస్పీ అభినందించారు.