మిర్యాలగూడ : ప్రజా సేవకుడు ఆ ప్రభుత్వ ఉద్యోగి .. దక్కిన ఇండియన్ ఐకాన్ అవార్డు..!

మిర్యాలగూడ : ప్రజా సేవకుడు ఆ ప్రభుత్వ ఉద్యోగి .. దక్కిన ఇండియన్ ఐకాన్ అవార్డు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన బీసీ జేఏసీ సెక్రెటరీ మారం శ్రీనివాస్ కు ప్రతిష్టాత్మక ఇండియన్ ఐకాన్ అవార్డు లభించింది. గత కొన్నేళ్లుగా సేవా రంగంలో దూసుకెళ్తున్న మారం శ్రీనివాస్ సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అవార్డు ప్రదానం చేసినట్టు ఆర్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సినీ నిర్మాత డాక్టర్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు.

 

దాదా సాహెబ్ ఫాల్కే 154వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ఎల్వీ ప్రసాద్ పిల్మ్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మారం శ్రీనివాస్ కు సినీ నటులు, నిర్మాతల ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేసినట్టు డాక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాసేవలో మకుటం లేని మారాజు మారం శ్రీనివాస్ అని అభివర్ణించారు. మారం శ్రీనివాస్ లాంటి సమాజ సేవకులు జాతికి వెలకట్టలేని సంపద లాంటివరని అభివర్ణించారు. రానున్న రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాల్ని నిర్వహించాలని డాక్టర్ రంజిత్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మూసా అలీ ఖాన్, సినీ నటి గీతా సింగ్, నటుడు నిఖిల్, జీవా, అజయ్ గోపీ,రామ్ లక్ష్మణ్, సూర్య తేజా, బ్రహ్మయ్య చారీ,సునామి సుధాకర్, జబర్దస్త్ పవన్, తదితరులు పాల్గొన్నారు.

 

ఆ ప్రభుత్వ ఉద్యోగి సామాజిక సేవకుడు :

ఓ వైపు విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ తన వృత్తి ధర్మాన్ని నిర్వరిస్తూనే మరోవైపు సామాజిక బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, నల్లగొండ జిల్లా అధ్యక్షులు మారం శ్రీనివాస్. బడుగు, బలహీన వర్గాల ఆశాదీపంగా మారారు. ఆయన తండ్రి నాగభూషణం పేరిట నాన్న ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని తల్లి మారం రాంబాయమ్మ, భార్య శుభాషినిలతో కలిసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

 

నిరుపేద కుటుంబాలకు ఆయన సహాయసహకారాలు అందిస్తున్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే క్షణం ఆలోచించకుండా ఆయనకు తోచిన సాయం అందజేస్తారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన మారం శ్రీనివాస్ సేవల పట్ల సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అనేక మంది ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన సేవలను, సేవా నిరతిని, దయార్థ చిత్తాన్ని కొనియాడుతున్నారు. సేవా కార్యక్రమాల ద్వారా నల్లగొండ జిల్లాలో బీసీ నేతల్లో బలమైన నేతగా అంచలంచలుగా ఎదుగుతూ విజయపథంలో ముందుకెళ్తున్నారు. దశాబ్ద కాలం నుంచి మారం శ్రీనివాస్ నిర్వర్తిస్తున్న నిరంతర సేవా కార్యక్రమాలను అఖిల భారత వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ( ఏఐడబ్ల్యూజేఏ) గుర్తించింది.

ఉగాది పండుగ సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి 20 రంగాల్లో విశేష కృషి, సేవలందిస్తున్న 100 మంది శతయోధులను ఎంపిక చేసింది. వీరిలో సామాజిక సేవా రంగంలో మారం శ్రీనివాస్ నిర్వర్తించిన కృషికి అవార్డు వరించింది. హైదరాబాద్ నగరంలోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ కాన్ఫెరెన్స్ హాల్ లో ఏఐడబ్ల్యూజేఏ జాతీయ అధ్యక్షుడు, కేకేఆర్ బ్రాడ్ కాస్టింగ్ మీడియా అధినేత డాక్టర్ కే.కోటేశ్వర్ రావు, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా మారం శ్రీనివాస్ అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది జులైలో హైదరాబాద్ నగరంలోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రముఖ ఆర్కే కళా సంస్కృతి ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో టాలీవుడ్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు-2022 ప్రదానం కార్యక్రమం నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో మారం శ్రీనివాస్ కు స్పెషల్ జ్యూరీ అవార్డు-2022ను ప్రదానం చేశారు. సమాజ సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న మారం శ్రీనివాస్ నిస్వార్థ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసిన ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ రంజిత్ కుమార్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ ఏడాది ఏప్రిల్ 17న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా పుడమి సాహితీ వేదిక, తెలంగాణ వర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మారక జాతీయ పురస్కారాన్ని మారం శ్రీనివాస్ అందుకున్నారు. గతేడాది సేవా సమ్రాట్ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. బీసీల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. నిరుపేద విద్యార్థుల విద్యాభ్యాసం కోసం, ఉపాధి కోల్పోయినవారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తన వంతుగా సాయం అందిస్తున్నానని అన్నారు.

 

నేత కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నాని అన్నారు. కులమతాలకు అతీతంగా పండుగల సందర్భంగా కడు పేదరికంలో ఉన్నవారిని గుర్తించి బియ్యం, నిత్యవసరాలను పంపిణీ చేస్తున్నానని చెప్పారు. తన సేవా కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలను చేరువ చేసేందుకు కృషి చేస్తున్నానని మారం శ్రీనివాస్ తెలిపారు.

 

బలహీన వర్గాల ఆశాదీపం : 

మిర్యాలగూడలో నిరుపేద పద్మశాలి చేనేత కుటుంబానికి చెందిన యువతి వివాహానికి మారం శ్రీనివాస్ రూ.5వేలు చేయూత అందజేశారు. వివరాల్లోకి వెళ్లితే…పెండెం భవాని అనే యువతి వివాహం అశోక్ అనే యువకుడితో జరిగింది. పుట్టు మూగ ఆయిన భవాని కుటుంబీకులు కడు పేదరికంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆమె తల్లి పార్వతమ్మ చేనేత కార్మికురాలు. భవాని అన్నయ్య ఇద్దరూ వికలాంగులు. భవాని కుటుంబం ఆమె వివాహ నిమిత్తం ఖర్చుల కోసం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకొని ఆర్ధిక సాయం చేసేందుకు మారం శ్రీనివాస్ ముందుకొచ్చారు. తన వంతుగా రూ.5వేలు ఆర్ధిక సాయం అందజేశారు.

 

భవాని తండ్రి నరసయ్య మరణం తర్వాత ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. భవాని లాంటి నిరుపేదలకు సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని మారం శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

పక్షవాతం బాధిత కుటుంబానికి బాసటగా :

పక్షవాతం కారణంగా కాళ్లుచేతులు చచ్చుబడి మంచానికే పరిమితమై కుటుంబ పోషణ భారంగా మారిన చెరుపల్లి నాగరాజు అనే బాధితుడి కుటుంబానికి బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మారం శ్రీనివాస్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్ వెన్నుదన్నుగా నిలిచారు. రూ.60వేల వ్యయంతో టిఫిన్ సెంటర్ నిర్వహణ కోసం తోపుడు బండి, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్, ఇడ్లీ పాత్ర, కూలింగ్ వాటర్ క్యాన్, అన్ని రకాల నిత్యావసర సరుకులను పద్మశాలి ఉద్యోగుల ఉపాధ్యాయుల సమక్షంలో డీఎస్పీ వెంకటేశ్వర్ రావు చేతుల మీదుగా నాగరాజు కుటుంబ సభ్యులకు అందజేశారు.

 

కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం :

కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల సహకారంతో 300 కుటుంబాలకు, సొంతంగా 200 కుటుంబాలకు మారం శ్రీనివాస్ సాయం అందించారు. అనేక నిరుపేద కుటుంబాలను అక్కున చేర్చుకొని బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.

 

నిరుపేద కుటుంబానికి చేయూత :

మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి మారం శ్రీనివాస్ చేయూతను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. కోవిడ్ దృష్ట్యా నెలకొన్న విపత్కర పరిస్థితుల కారణంగా ఇంటి అద్దెకూడా చెల్లించలేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రవణమ్మ కుటుంబానికి బాసటగా నిలిచారు. రవణమ్మ కుటుంబానికి తన వంతుగా 50కిలోల బియ్యం, నూనె క్యాన్ ను అందజేశారు.

 

వివరాల్లోకి వెళ్లితే… రవణమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు, కోడలు, మనవరాలు ఉన్నారు. ఆమె కుమారుడు గతేడాది చనిపోయాడు. దీంతో, ఆమె కుటుంబ పోషణ భారంగా మారింది. కొడుకు చనిపోయిన బాధతో రవణమ్మ గతవారం చనిపోయారు. ఆమె కుటుంబానికి మారం శ్రీనివాస్ మనో ధైర్యం కల్పించి తన వంతుగా సహకరించారు.

 

సేవాతత్పరుడు మారం శ్రీనివాస్ :

ఆపదలో ఉన్న అభాగ్యులకు మారం శ్రీనివాస్ అపద్భాందవుడయ్యారు. సరస్వతీ పుత్రులకు తన వంతుగా ఆర్ధిక సహకారం అందజేస్తూ విద్యా వ్యాప్తికి విశేష కృషి చేస్తున్నారు. ఓ వైపు బీసీల ఐక్యత కోసం పాటుపడుతూనే మరోవైపు సర్వమత సౌభ్రాతృత్వం కోసం అందరితో మమేకమవుతూ సేవా కార్యక్రమాల ద్వారా మన్ననలు పొందుతున్నారు. గతేడాది పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం మహిళలకు రూ.499 విలువైన నాణ్యమైన ఒయాసిస్ ఫుడ్స్ రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బందిపడుతున్న తోపుచర్ల గ్రామానికి చెందిన మౌలాలీ అనే మహిళకు ఆర్ధిక సాయాన్ని అందజేసి మారం శ్రీనివాస్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. :

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మారం శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. వృత్తిలో నిబద్ధతను, క్రమశిక్షణ, అంకిత భావాన్ని కనబరిచి నాటి నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాన్ని పొందారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘాల నేతలు, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అభినందనలు పొందారు.