Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

ఆమనగల్లు పోలీసులు ప్రత్యేక తనిఖీలు.. 35 కిలోల గంజాయి పట్టివేత..!

మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించినా సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని మహేశ్వరం జోన్‌ డీసీపీ నారాయణ రెడ్డి హెచ్చరించారు.

ఆమనగల్లు పోలీసులు ప్రత్యేక తనిఖీలు.. 35 కిలోల గంజాయి పట్టివేత..!

ఆమనగల్లు, మనసాక్షి:

మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించినా సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని మహేశ్వరం జోన్‌ డీసీపీ నారాయణ రెడ్డి హెచ్చరించారు. గంజాయి రవాణాపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారని యువత భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఆమనగల్లు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో సుమారు 35 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. బుధవారం ఆమనగల్లు పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ కేసు వివరాలు వెల్లడించారు.

పక్కా విశ్వసనీయ సమాచారంతో అక్టోబర్‌ 5న ఆమనగల్లు పోలీసులు ఎస్‌ఓటీ బృందం సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.ఈ క్రమంలో ఆమనగల్లు మార్కెట్‌ యార్డు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తూ గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.

విచారణలో వారు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధికి చెందిన కుంజం చందుబాబుదొర (26), కోసు వెంకటసాయిబాబుదొర (23)గా గుర్తించినట్లు తెలిపారు. రంపచోడవరం ప్రాంతానికి చెందిన ‘అభి’ అనే వ్యక్తి గంజాయి రవాణా కోసం నిందితులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలిందన్నారు.

గంజాయిని ఆమనగల్లుకు చేర్చితే ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున చెల్లిస్తానని ఆశ చూపినట్లు తెలిపారు. దీంతో నిందితులు రాజమండ్రి మీదుగా హైదరాబాద్‌ మార్గంలో ఆమనగల్లుకు చేరుకుని మార్కెట్‌యార్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తికి గంజాయి అప్పగించేందుకు వేచి ఉండగా పోలీసులకు చిక్కారని వివరించారు. వారి వద్ద 17 ప్యాకెట్లలో ప్యాక్‌ చేసిన సుమారు 35 కిలోల గంజాయితో పాటు వివో మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి ఇతర వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.17.60 లక్షలు ఉంటుందని డీసీపీ పేర్కొన్నారు.ఈ కేసులో ప్రధాన గంజాయి సరఫరాదారు.అభి పరారీలో ఉన్నాడని అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.

గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని మాదకద్రవ్యాల జోలికి వెళ్లేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా మని డీసీపీ స్పష్టం చేశారు. ఆపరేషన్‌ను సమర్థ వంతంగా నిర్వహించిన ఆమనగల్లు ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్లు,ఎస్‌ఓటీ అధికారులు,పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

మరిన్ని వార్తలు