Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

Telangana : బయటపడ్డ వెయ్యేళ్లనాటి శిల్పాలు..!

Telangana : బయటపడ్డ వెయ్యేళ్లనాటి శిల్పాలు..!

చాళుక్య, కాకతీయులనాటి చెన్నకేశవ, జనార్ధన, నాగదేవతల శిల్పాలు
పురావస్తు పరిశోధకుడు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి

అందోలు, మనసాక్షిః

సంగారెడ్డి జిల్లా ఆందోలు పెద్ద చెరువు ఒడ్డున గల నాగులకట్ట వద్ద ఉన్న శిల్పాలు వెయ్యేళ్లనాటివని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా, సీఈవో, డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. అందోలు వద్ద బయటపడ్డ విగ్రహాలు చారిత్రాత్మకమైన విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ దృష్టికి తీసుకువెళ్లానని, వాటిని పరిశీలించాలని, ఆయన సూచన మేరకే తాను పరిశీలించినట్లు తెలిపారు. ఈ

సందర్బంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అందోలు రంగనాథ స్వామి గోపురం ముందు రాష్ట్ర కూటుల, కళ్యాణి చాళుక్యుల కాలం (క్రీ.శ. 9–10 శతాబ్దాలు), నాటి మహిషాసురమర్ధిని శిల్పాలు, నాగులకట్ట పైనున్న కళ్యాణి చాళుక్య, కాకతీయుల కాలంనాటి (క్రీ.శ. 11–13 శతాబ్దాల నాటి) చెన్నకేశవ, జనార్ధన, నాగదేవతల శిల్పాలు, అలనాటి అద్భుత శిల్పకళా కౌశలానికి అద్దం పడుతున్నాయన్నారు.

చెన్నకేశవ విగ్రహం చుట్టూ గల మకరతోరణం, శ్రీదేవి, భూదేవి, దశావతార శిల్పాలు చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొన్నాయన్నారు. ఈ చారిత్రాత్మిక శిల్పాలతో ప్రదర్శనశాల ఏర్పాటు చేసి ప్రదర్శిస్తే బాగుంటుందని, ఈ ప్రదర్శన శాల వల్ల ఆందోలు పర్యాటక కేంద్రం అవుతుందని శివనాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. సింగూరు ప్రాజెక్టు త్రవ్వకాల సమయంలో కూడా చుట్టూ ఉన్న గ్రామాల వద్ద ఎన్నో విగ్రహాలు బయటపడ్డాయని, అప్పట్లో తాను ఆ విగ్రహలన్నింటిని ప్రాజెక్టు వద్దకు చేర్చగలిగినట్లు ఆయన గుర్తు చేశారు.

అందోలు వద్ద శిల్పాలతో ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలి
వెయ్యేళ్లనాటి శిల్పాలను ఒక్క చోటకు చేర్చి ప్రత్యేకంగా ప్రదర్శన శాలను ఏర్పాటు చేయాలని అందోలు గ్రామస్తుల కోరుతున్నారు. చారిత్రాత్మకమైన శిల్పాలకు తగిన ఆదరణలేదని, పండగల సమయంలో మాత్రమే విగ్రహలకు పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు. అందోలు పెద్ద చెరువును టూరిజం స్పాట్‌గా మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అభివృద్ది చేస్తున్నందున విగ్రహలను కూడా ప్రదర్శనగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు