నల్గొండ : తాలు పేరుతో మిల్లర్ల కొర్రీలు.. దిగుమతికాని లారీలు
తాలు పేరుతో మిల్లర్ల కొర్రీలు.. దిగుమతికాని లారీలు
కనగల్ , మన సాక్షి
ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా కావడం లేదని ఆందోళన చెందిన రైతులు శుక్రవారం నల్లగొండ – హాలియా రహదారిపై ధర్నా నిర్వహించారు. ఎస్. లింగోటంలో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు విక్రయించేందుకు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాలు పేరుతో మిల్లర్లు కొర్రీలు పెడుతూ ఐకెపి కేంద్రం నుంచి వెళ్లిన వడ్ల లారీలను దిగుమతి చేసుకోకుండా రోజుల తరబడి మెల్లువొద్దనే ఉంచుతున్నందున కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిలువలు పేరుకు పోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మిల్లులో దిగుమతి కాకపోవడంతో లారీలు రాక కొనుగోలు కేంద్రంలో కాంటా కావడం లేదని ఆరోపించారు.
రైతుల ధర్నాతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. నల్లగొండ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) భాస్కరరావు అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
త్వరగా దిగుమతి అయ్యేవిధంగా మిల్లర్లతో మాట్లాడి త్వరితగతిన వడ్లు కాంటా అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. లారీల సంఖ్యను పెంచి కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు. తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలని రైతులకు సూచించారు.
ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చూడాలని కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. ఇదిలా ఉంటే అకాల వర్షాలు కురిసి వరి ధాన్యం ఆగమైతే మా పరిస్థితి ఏమిటని రైతులు అధికారులకు విన్నవించగా ప్రతిరోజు రెవిన్యూ సివిల్ సప్లై అధికారులు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అడిషనల్ కలెక్టర్ వెంట కనగల్ తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎస్సై నగేష్, మాజీ సర్పంచ్ పోశమల్ల లింగయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.









