Narayanpet : చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. వైద్యులను ఆదేశించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ..!
Narayanpet : చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. వైద్యులను ఆదేశించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం నారాయణపేట మెడికల్ కళాశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాలలో కేవలం ఒక సంవత్సరం తరగతులు కావాల్సిన వసతులే కాకుండా ద్వితీయ సంవత్సర తరగతుల నిర్వహించేందుకు అవసరమైన వసతి సౌకర్యం సమకూర్చాలని ఆమె సూచించారు.
బుధవారం మెడికల్ కళాశాలను జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ తో కలిసి పరిశీలించారు. కళాశాల మీటింగ్ హల్ లో కళాశాల ప్రిన్సిపల్, టీజీ ఎమ్ ఐ డి సి అధికారులు, కళాశాల వైద్య నిపుణులతో ఆమె మెడికల్ కళాశాల నిర్వహణపై సమీక్షించారు. మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతుల నిర్వాహనకు ఏమేమి వసతులు కావాలని, ఇప్పటివరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారని ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా అనాటమీ, ఫిజియాలజీ,బయో కెమిస్ట్రీ విభాగాలకు సంబంధించి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరమని ఆయా విభాగాల వైద్య నిపుణులతో చర్చించారు. ఒకసారి కళాశాల తరగతులు ప్రారంభించిన తర్వాత మళ్లీ ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకూడదని ఆమె తెలిపారు.
తరగతుల కు సరిపడా ఫర్నిచర్ వచ్చిందా? ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఇండెంట్ పంపించాలని చెప్పారు. ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రెండో సంవత్సరం తరగతుల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే మెడికల్ కళాశాల 3వ అంతస్తులో బ్లడ్ బ్యాంక్, డయాలసిస్, ఇతర ల్యాబ్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
వెనుకబడిన ఈ ప్రాంతంలో వైద్యపరంగా పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని, అందుకోసం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆమె సూచించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ అధికారుల బృందంతో కలిసి ఆమె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ని, చిన్నపిల్లల ఆస్పత్రిని పరిశీలించారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో ని వార్డులను తిరిగి, అక్కడి వైద్య సదుపాయాలను చూశారు.
చిన్నపిల్లలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి మెయిల్ ఫిమేల్ వార్డులలో చికిత్స పొందుతున్న రోగులు, చిన్నపిల్లల తల్లులతో మాట్లాడి ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని? అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు చేసుకోవాలని ఆమె సూచించారు. ఆస్పత్రిలోని ఫార్మసీ, ఆరోగ్య మహిళ, ఐసీటీసీ విభాగాలకు వెళ్లి రోజుకు ఎంతమంది వస్తున్నారని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఫార్మసీలో ఏ ఏ మందుల కొరత ఉందని తెలుసుకున్న ఆమె వాటి ఇండెంట్ ను పంపించాలని ఆదేశించారు. ఆస్పత్రి లోని మెటర్నటీ వార్డును, ఆవరణలోని పి.పి. యూనిట్ ను ఆమె పరిశీలించారు. చివరగా ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అధికారుల బృందంతో కలసి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని ఎం సి హెచ్ (మదర్ అండ్ చైల్డ్ హెల్త్) విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో టీజీ ఎమ్ఐడిసి ఎం డీ హేమంత్ ఐఏఎస్, ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల, అకాడమిక్ డి ఎం ఈ శివరాం ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాoకిషన్, పాలమూరు మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, టీజీ ఎమ్ ఐ డి సి చీఫ్ ఇంజనీర్ దేవేందర్ కుమార్, ఈ ఈ జైపాల్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జున్, వైద్య కళాశాల వైద్య నిపుణులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
Viral Video : భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు.. భార్య చేసిన పనికి షాక్.. (వీడియో)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)
-
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త.. రేషన్ కార్డులు లేకున్నా మాఫీ.. ఎప్పటి వరకో చెప్పిన తుమ్మల..!
-
Viral Video : ప్రీవెడ్డింగ్ షూట్ లోనే అలా.. ఇదేం ఆత్రం రా నాయన.. (వీడియో)









