గంజాయి మత్తులో యువత.. అమ్మేవారి సమాచారం ఇస్తే గోప్యం..!
గంజాయి మత్తులో యువత.. అమ్మేవారి సమాచారం ఇస్తే గోప్యం..!
నిజామాబాద్ ( భీంగల్), మన సాక్షి :
బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలంలోని ఎంజి తండా వద్ద భీంగల్ ఎక్సైజ్ అధికారులు రూట్ వాచ్ చేసి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు, ఇద్దరు మేజర్లు. మేజర్లలో ఒకరైన పురానిపేట్ కు చెందిన తీగల అక్షయ్ గౌడ్ పైన ఫోక్సో కేసు కూడా ఉందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
వీరు గంజాయిని మహారాష్ట్ర లోని నాందేడ్ ప్రక్కన అంకోల్ నుండి తీసుకు వస్తున్నారని తెలిపారు. వీరి ద్వారానే భీంగల్ లో సప్లై చేస్తున్నారని తెలిసి ఎక్సైజ్ అధికారులు వీరికి వచ్చిన ఫోన్ కాల్స్, వీరు చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా ఎవరెవరు గంజాయిని వినియోగిస్తున్నారో తెలుసుకొని పట్టుకొచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఇందులో కొందరు మైనర్లు ఉండడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలిపారు. వీరి నుండి 364 గ్రాముల ఎండు గంజాయి, కెటిఎమ్ 200 డ్యూక్ బైక్ 4 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. 20-21 వయసులోనే గంజాయి అమ్ముతున్న ఇద్దరిని నిజామాబాద్ జైలు రిమాండ్ కు తరలించామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
మత్తులో యువత…
విద్యార్థులు యుక్త వయస్సులో విద్యాబుద్ధులు నేర్చుకుని, ఉన్నత విద్య, ఉద్యోగాలు సాధించాల్సిన యువత గంజాయికి అలవాటుపడి తమ బంగారు భవితను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తెస్తాడని తల్లిదండ్రులు కలలు కంటుంటే, వీరు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నాడు పట్టణాలకే పరిమితమైన గంజాయి భూతం నేడు గ్రామాలకు పాకింది.
యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ చోరీలకు పాల్పడుతూ, ఇతరుల పై దాడులు చేస్తూ ప్రమాదాలకు పాల్పడడం, ప్రేమ వ్యవహారాలు తదితర కారణాలే కాకుండా తల్లిదండ్రులను డబ్బులు అడగడం ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంటర్, డిగ్రీ విద్యార్థులే లక్ష్యంగా కొన్ని గ్రామాలను, గ్రామ శివారులో ఉన్న గుట్టలను, అడ్డాగా చేసుకొని గంజాయి వ్యాపారానికి దిగారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువకులే మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కొందరు యువకులు మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడి తన విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
సిగరెట్ లోని తంబాకును దులిపేసి దాని స్థానంలో గంజాయిని నింపుకొని దమ్ము లాగిస్తూ హుక్కా తరహాలో పీల్చడం యువకులకు అలవాటు అయ్యింది. మత్తుకు అలవాటు పడిపోయిన యువకులు నేరాలకు అలవాటు పడిపోతున్నారు. కొత్త ప్రపంచం.. ఒకరితో ఒకరు స్నేహం చేస్తూ గంజాయి వ్యసనాన్ని అంటురోగంగా చేసుకుంటూ మత్తే ప్రపంచంగా గంజాయికి బానిస అవుతుంది.
బానిసలుగా మారిన యువకుల శరీరాకృతి సైతం మారిపోయి మానసిక రోగులుగా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. దశలో గుర్తించలేని తల్లిదండ్రులు ఆలస్యంగా తెలుసుకొని తమ పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పిస్తూ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం.. పోలీస్ అధికారులు
గంజాయికి బానిసలు అవుతున్న యువత, చెడువ్యసనాలు పట్టకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని భీంగల్ ఎక్సైజ్ సిఐ పి వేణుమాధవ్ & భీంగల్ ఎస్ ఐ మహేష్ తెలిపారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తును, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అని గంజాయి రవాణా చేసిన, అమ్మిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం అని.
నమాచారం తెలిస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం అని ఎస్ఐ మహేష్ పేర్కొన్నారు. ఇప్పటికైనా కొంత సేపటి మత్తు కోసం యువత జీవితాలు నాశనం చేసుకోకూడదని ఆశీద్దాం.










