District Collector : ప్రకృతి వ్యవసాయము పట్ల రైతులను ప్రోత్సహించాలి.. కలెక్టర్ ఇలా త్రిపాఠి..!
District Collector : ప్రకృతి వ్యవసాయము పట్ల రైతులను ప్రోత్సహించాలి.. కలెక్టర్ ఇలా త్రిపాఠి..!
నల్లగొండ ,మన సాక్షి:
ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం పట్ల జిల్లా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలే కాకుండా , కూరగాయలు, పండ్ల తోటలు, , వాణిజ్య పంటలు సాగు చేయడం,ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.
శుక్రవారం ఉదయాదిత్య భవన్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, వ్యవసాయ అధికారులతో రానున్న వానకాలం వ్యవసాయ సాగు సంసిద్ధత పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు క్రమం తప్పకుండా పండించే వరి ,పత్తి వంటి పంటల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ప్రత్యేకించి వరిలో శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉండడం, పంట అమ్మకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, అకాల వర్షాల వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని జిల్లా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళించాలని, ముఖ్యంగా కంది, కూరగాయలు, పండ్ల తోటలు,అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటలవైపు వారిని మళ్లించాలని తెలిపారు. వీటితోపాటు, ప్రకృతి వ్యవసాయం పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించేలా రైతులకు అవగాహన కల్పించాలని, రైతు ఉత్పత్తి సంస్థల ఏర్పాటు, మరింతమంది అభ్యుదయ రైతుల ను తయారు చేయడం పై దృష్టి సాధించాలని కోరారు .
ఉద్యాన పంటలు, నూతన వంగడాల సాగుకు సంబంధించి ప్రతి 2 మండలాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ కు ప్రోత్సాహాం కల్పించేలా నెలలోపు ప్రతిపాదనలు సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు .ఉద్యాన పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం తరఫున సబ్సిడీ, డ్రిప్ వంటి సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటలు ,ఉద్యాన పంటలు, కూరగాయల పంటల సాగు, అధిక దిగుబడులు సాధించే అంశాలపై వచ్చేవారం అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు రైతులు, శాస్త్రవేత్తలు,వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం సమగ్రమైన ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ శాసనసభ్యులు, కట్టంగూరు రైతు ఉత్పాదక సంస్థ వ్యవస్థాపకులు నంద్యాల నరసింహారెడ్డి అన్నారు.
వివిధ రకాల పంటల సాగు, ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు సాధిస్తున్న అభ్యుదయ రైతులు మరి కొంతమంది అభ్యుదయ రైతులను తయారు చేయాలని, రైతులలో వ్యాపార దృక్పథం పెరగాల్సిన అవసరం ఉందని, రైతులు పండించిన పంటలకు పటిష్ట మార్కెట్ వ్యవస్థ ఉండాలని, మధ్యదళారీ వ్యవస్థ తగ్గాలని అన్నారు.
చందంపేట అభ్యుదయ రైతు పద్మా రెడ్డి మాట్లాడుతూ సేంద్రియ ఎరువులతో పంటలు పండించడం, సంప్రదాయ పద్ధతిలో భూగర్భ జలాలు పెంచేందుకు కందకాల తవ్వకం, ఉధ్యాన, కూరగాయల పంటల వల్ల గడిచిన 10, 15 సంవత్సరాల నుండి వ్యవసాయంలో తాను అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నానని, గత 14 సంవత్సరాలుగా పంటలకు ఎలాంటి రసాయన ఎరువులు వినియోగించలేదని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయ రైతు మరియు ప్రకృతి వ్యవసాయ జిల్లా స్థాయి కమిటీ సభ్యులు అంజిరెడ్డి మాట్లాడుతూ తాను గడిచిన పది సంవత్సరాల నుండి ఏలాంటి పురుగుమందులు ,ఎరువులు వాడకుండా సాధారణ పంటలతో పాటు, పనస, మామిడి , చెమ్మ వంటి కూరగాయలను పండిస్తున్నానని, రైతు స్వయం సమృద్ధి సాధించడంతోపాటు, ఆరోగ్యం, స్వచ్ఛమైన , అత్యుత్తమ పోషక విలువలు కలిగిన పంటలను పండించేందుకు తాను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. సహజంగా పండిన పంటలలో సారం ఎక్కువగా ఉంటుందని అన్నారు.
గత ఐదు సంవత్సరాలలో తాను ఎరువులు పురుగు మందుల పై 10 రూపాయలు ఖర్చు చేయలేదని చండూరు మండలం, జక్కులవారి గూడెం కు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు జక్కుల వెంకటేష్ అన్నారు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకొని గ్రామానికి వచ్చి ముందుగా సెమి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ తర్వాత పూర్తిగా సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించానని, మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉన్న ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం చేయాలని నిడమనూరు మండలం, గుంటుపల్లి కి చెందిన రైతు నవీన్ రెడ్డి అన్నారు.
మందులు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లు అన్ని ఏర్పాటు చేసుకుని గోదాం కూడా కట్టించుకుని రైతుకు అన్ని సులభంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు నవీన్ రెడ్డి తెలిపారు.కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, అభ్యుదయ రైతులు కోట్టం సత్తిరెడ్డి ,శ్రీనివాసరావు, మందడి గోపాల్ రెడ్డి ,పల్లె జగన్, కనగల్ రాంరెడ్డి, బొడ్డుపల్లి ఈదయ్య, పెద్దఊర పాత ఎల్లయ్య, ఐలాపురం వెంకన్న తదితరులు నూతన పద్ధతిలో పండిస్తున్న ఉద్యాన, కూరగాయల సాగు, పామాయిల్ తోటల పెంపకం, ప్రకృతి వ్యవసాయం, లాభాలు, దిగుబడులు తదితర అంశాలపై వివరించారు.
జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి, తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కూరగాయల సాగు సాగు, పామాయిల్ పై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కరపత్రాన్ని, బుక్ లెట్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
MOST READ :
-
CM Revanth Reddy : కుల గణన పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!
-
District collector : వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్..!
-
District collector : చేయూత పెన్షన్లపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..!
-
Army : విశ్రాంత సైనికులకు తోడుగా యాక్సిస్.. వారందరికీ పెన్షన్లు, సంక్షేమ పథకాలు..!
-
Miryalaguda : బాలింత మృతి సంఘటనపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. మిర్యాలగూడ శిరీష హాస్పిటల్ పై మెజిస్టేరియల్ విచారణ..!
-
District Collector : ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!









