శంకర్‌పల్లిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి.. పరామర్శించిన మంత్రి..!
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థకు చెందిన ప్రాజెక్ట్ సోమవారం మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

శంకర్‌పల్లిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి.. పరామర్శించిన మంత్రి..!
ప్రమాద స్థలిని పరిశీలించిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, మొయినాబాద్ డిసిపి యోగేష్ గౌతం
శంకర్‌పల్లి, (మన సాక్షి):
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థకు చెందిన ప్రాజెక్ట్ సోమవారం మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా వీసిన తీవ్ర గాలుల ప్రభావంతో, భద్రతా ప్రమాణాలు పాటించినప్పటికీ భారీ క్రేన్ అదుపుతప్పి కూలిపోవడంతో అక్కడి పరిస్థితి విషాదకరంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం.
మరో 11 మందికి తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కోసం తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుంటే, మృతుల సంఖ్య పెరిగే అవకాశంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ప్రాజెక్ట్ పనిచేస్తున్న కార్మికులు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు అకస్మాత్తుగా మారి గాలి వేగం తీవ్రంగా పెరగడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సమాచారం ప్రకారం, క్రేన్ కు అవసరమైన భద్రతా లాకింగ్ వ్యవస్థ అమలులో ఉన్నప్పటికీ, అనూహ్యంగా వచ్చిన గాలుల తీవ్రత కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. యాజమాన్యం వెంటనే స్పందించి సహాయక చర్యలను ప్రారంభించింది.
గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించడమే కాకుండా, సంఘటనా స్థలంలో రక్షణ చర్యలను వేగవంతం చేసింది. క్రేన్ కింద ఎవరైనా చిక్కుకుని ఉన్నారాఅనే విషయంపై కూడా పరిశీలనలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలానికి చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, మొయినాబాద్ డిసిపి యోగేష్ గౌతమ్ చేరుకొని ప్రమాద స్థలిని పరిశీలించి, యాజమాన్యంతో మాట్లాడి ఆరా తీశారు. వారి వెంట సీఐ మీర్ము దసర్ అలీ, ఎస్ఐలు ఉన్నారు.
ప్రమాద ఘటన బాధితులను పరామర్శించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
శంకర్‌పల్లి మండల పరిధిలోని మహాలింగాపురం గ్రామ శివారులో గల ఎన్ సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీ ప్రాజెక్ట్ ప్రమాదంలో ఒక్కసారిగా వీసిన తీవ్ర గాలుల ప్రభావంతో పని ప్రదేశంలో 212 టన్నుల భారీ క్రేన్ అదుపుతప్పి అక్కడే పనిచేస్తున్న కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందారు. గాయపడ్డ బాధితులను మంగళవారం ఉదయం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పట్టణ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులో గల లలిత, గాయత్రి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన 12 మందికి మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులకు సూచించారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందడం తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. మృ తుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో ధైర్యం కలగాలని మంత్రి ఆకాంక్షించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, ఏఎంసి వైస్ చైర్మన్ కాశెట్టి మోహన్, కోఆప్షన్ సభ్యులు మహమూద్, నాయకులు గోపాల్ రెడ్డి, చంద్రమౌళి, పాండురంగారెడ్డి, అధికారులు ఉన్నారు.










