ఖరీఫ్ సాగుకు రైతన్న సన్నద్ధం..!
అన్నమయ్య జిల్లా రైతన్నకు తొలకరి చినుకు పలకరించింది. ఇదే చినుకు ఐదు నెలలు కొనసాగితే రైతులు ఇంట భోగభాగ్యాలే, సిరిసంపదలు దర్శనమిస్తాయి.

ఖరీఫ్ సాగుకు రైతన్న సన్నద్ధం..!
వరుణుడు కరుణిస్తే రైతు ఇంట భోగభాగ్యాలు, సిరిసంపదలే..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రైతన్నకు తొలకరి చినుకు పలకరించింది. ఇదే చినుకు ఐదు నెలలు కొనసాగితే రైతులు ఇంట భోగభాగ్యాలే, సిరిసంపదలు దర్శనమిస్తాయి. కరువు నేలగా పిలవబడే రాయలసీమ ప్రాంతంలో వర్షాన్ని దేవుడిలాగా పూజిస్తారు.
వర్షం బాగా కురిసి,భూమిలో వేసిన విత్తనం బాగా పండితే అన్నదాతకు కొదవ ఉండదు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో ఎక్కువగా వేరుశనగ, వరి, కంది, అనప, అలసంద, సెనగ వంటి రకాలైన వ్యవసాయ పంటలు సాగు చేస్తారు. ఎక్కువగా వర్షం మీద ఆధారపడే రాయలసీమ ప్రాంతంలో ఈ పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది వరుణ దేవుడు కరుణించి కరువు నేల పైన కురిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా పచ్చదనముతో కళకళలాడుతుంది.
తొలకరి తొలి సంతకం
తొలి జల్లు కురిసింది.
నేలమ్మ దాహం తీర్చేందుకు,
చల్లగాలి పిలిచింది.
చిలిపి మనసు నవ్వేందుకు.
ఎండిన మన్ను తడిసి
బుసబుసమని పొంగింది,
పరమాన్నమే వండి
జీవులకు ప్రసాదం పెట్టింది.
మట్టి వాసనతో పులకించి
మల్లెలన్నీ సిగ్గు విడిచే,
చిరు మొక్కలు అవతరించి
నింగికేమో కబుర్లు చెప్పే.
గాడి మానులో ఎద్దు
గంగిరెద్దులా లంఘించే,
నాగలి హారం మెడలో దాల్చి
నేలమ్మపై చిందులేసే.
రైతన్న ముఖం విచ్చుకుంది.
శ్రమకు రెక్కలు కట్టుకొని,
సిరి ధాన్యపు కలల కోసం
మట్టి ముద్దను ముద్దాడింది.
వేడెక్కిన భూమి
నింగి కార్చిన గంగలో,
పవిత్ర స్నానం చేస్తూ
కల్మషాన్ని కడిగి వేసింది.
ఏరువాక కదులుతూ
నీటి కుండలు నిండుతూ,
జీవులకు కండలు పెంచుతూ
పునర్జీవం తెచ్చింది.
పచ్చని గడ్డి మొలచి
పశువులన్నీ బలసి,
పాలామృతాన్ని పంచుతూ
జాతికి వన్నె నింపింది.
తొలకరి ఒక చిరునామాగా,
తొలిచూపుల కావ్యంగా,
మట్టి మనసులకు సంతోషంగా,
తన సంతకమే నేలపై చేసింది.
By: Venugopal, Ramasamudram









