Online Trading : ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో బురుడీ.. కొత్త తరహాలో సైబర్ మోసం..!
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఒక పెద్ద సైబర్ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.

Online Trading : ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో బురుడీ.. కొత్త తరహాలో సైబర్ మోసం..!
బాధితుడి నుండి రూ21.60 లక్షల కాజేత..
ఏడుగురిని అరెస్ట్ చేసి, రూ. 26.57 లక్షలు రికవరీ చేసిన పోలీసులు
శేరిలింగంపల్లి, మన సాక్షి :
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఒక పెద్ద సైబర్ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కేసు నెంబర్ 1053/26 కింద దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముఠాకు చెందిన ఏడుగురు నేరస్థులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ26,57,500 నగదును రికవరీ చేసినట్లు సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్ వెల్లడించారు. నేరస్థులు తాము కొల్లగొట్టిన సొమ్మును బ్యాంకుల్లో ఉంచకుండా, విత్‌డ్రా చేసి ఇళ్లలోనే దాచుకోవడం వల్ల నగదును సులువుగా పట్టుకోగలిగామని ఆయన పేర్కొన్నారు.
ఫేస్‌బుక్ యాడ్.. ఫేక్ లాభాలతో ఎర
గండిపేటకు చెందిన సురేష్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో వచ్చిన ఒక ట్రేడింగ్ ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు. ఆ ముఠాకు చెందిన కీర్తినాయుడు, ఇషితా ప్రయోగ అనే మహిళలు మెంటార్లుగా నటిస్తూ అతడిని వాట్సాప్ ట్రేడింగ్ గ్రూపుల్లో చేర్చారు. మొదట రూ10,000 ఇన్వెస్ట్ చేయించి నమ్మకం కుదిర్చారు. ఆ తర్వాత ఎల్ఆర్ఏ క్యాపిటల్ డెస్క్ యాప్‌లో సురేష్ రెడ్డితో ఫిబ్రవరి 15 నాటికి రూ21.60 లక్షలు ఇన్వెస్ట్ చేయించారు.
ALSO READ : BREAKING : కరీంనగర్ జిల్లాలో బావిలో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం..!
బాధితుడిని మరింత నమ్మించడానికి ఒకే రోజులో రూ1.28 లక్షల లాభం (దాదాపు 10%) వచ్చినట్లు ఫేక్ స్క్రీన్ (ఫిషింగ్) ద్వారా చూపించారు. అనంతరం బార్క్లేస్ అనే ప్రీమియం ప్లాటినం గ్రూప్‌లోకి మార్చారు. ఆ గ్రూప్‌లోని మిగతా సభ్యులంతా సైబర్ కేటుగాళ్లే కావడంతో, వారంతా నకిలీ లాభాల స్క్రీన్ షాట్లతో బాధితుడిని మరింత భ్రమల్లో ముంచారు.
చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చే భారీ లాభాల ప్రకటనలను నమ్మి ప్రజలు మోసపోవద్దని డీసీపీ ఈ సందర్భంగా హెచ్చరించారు.
ALSO READ : Miryalaguda: ప్రమాదం కాదు పక్కా ప్లాన్.. గ్యాస్ పేలి ముగ్గురు సజీవ దహనం ఘటనలో బిగ్ ట్విస్ట్..!










