Karimnagar : రెవెన్యూ కార్యాలయంలో అవినీతిపై విచారణ జరపాలి..!
కరీంనగర్ రూరల్ మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి, పహాణి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ల కోసం లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై తక్షణమే నిష్పాక్షిక విచారణ జరిపించాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

Karimnagar : రెవెన్యూ కార్యాలయంలో అవినీతిపై విచారణ జరపాలి..!
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్
కరీంనగర్ , మనసాక్షి :
కరీంనగర్ రూరల్ మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి, పహాణి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ల కోసం లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై తక్షణమే నిష్పాక్షిక విచారణ జరిపించాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్ మాట్లాడారు. ఇటీవల దినపత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం.. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
లంచాల వల్ల సాధారణ ప్రజలు, ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలు తమ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, చివరికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమన్నారు. పత్రికల్లో వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు వెంటనే నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు. లంచాల వసూళ్లపై నిజానిజాలు తేల్చి, బాధ్యులైన అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.
దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజలకు నేరుగా సేవలు అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజల హక్కు అని, అవి అమ్ముకునే వస్తువులు కావు అని నాయకులు స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలలు కన్న సమానత్వ సమాజంలో అవినీతికి తావు లేదన్నారు. ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన, పారదర్శకమైన పరిపాలన అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తప్పట్ల అంజయ్య, జిల్లా సీనియర్ నాయకులు ఎర్రోళ్ల ప్రశాంత్, మండల నాయకులు తప్పట్ల అంజయ్య, బాపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









