Karimnagar : కరీంనగర్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాల్లో మేయర్ పర్యటన.. కీలక ఆదేశాలు..!
కరీంనగర్ నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో టూ టౌన్ సమీపంలోని నాలా, మంచిర్యాల్ చౌరస్తా నాలా, వి-పార్క్ సమీపంలోని నాలాతో పాటు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Karimnagar : కరీంనగర్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాల్లో మేయర్ పర్యటన.. కీలక ఆదేశాలు..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో టూ టౌన్ సమీపంలోని నాలా, మంచిర్యాల్ చౌరస్తా నాలా, వి-పార్క్ సమీపంలోని నాలాతో పాటు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద చేపట్టిన డ్రైనేజీ, వరద నీటి పారుదల పనుల పురోగతిని సమీక్షించిన మేయర్, పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారాల దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి అత్యవసర చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అదనపు యంత్రాంగాన్ని వినియోగించి నీటి పారుదల వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ యంత్రాంగం, డీఆర్ఎఫ్ బలగాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. శిథిలావస్థలో ఉన్న పాత మట్టి ఇళ్లలో నివసిస్తున్న వారు తమ భద్రత దృష్ట్యా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
43వ డివిజన్లో గోడ కూలి పక్కన ఇంటి పై పడిపోగా గోడను జేసీబీ సహాయంతో పూర్తిగా తొలగించి ప్రమాదాన్ని నివారించినట్లు తెలిపారు. నగరంలోని ఇతర ప్రమాదకర భవనాలు, గోడలను కూడా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు, సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా పనిచేయాలని మేయర్ ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో నగర ప్రజలు వెంటనే మున్సిపల్ కాల్ సెంటర్ నంబర్ 98499 06694 లేదా తమ సంబంధిత డివిజన్ కార్పొరేటర్‌ను సంప్రదించాలని సూచించారు. అందిన ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్లు పడాల శ్రీజ అజయ్, పొన్నం లక్ష్మీ మొండయ్య, నునావత్ భాస్కర్ నాయక్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.










